Muskmelon : వేసవి కాలంలో మనకు మామిడి పండ్లు, పుచ్చకాయలు, లిచీ, తర్బూజాలు ఎక్కువగా లభిస్తుంటాయి. ఇవి ఈ సీజన్‌లోనే అధికంగా అందుబాటులో ఉంటాయి. అందువల్ల వేసవిలో వీటిని అందరూ ఎక్కువగా తింటుంటారు. వీటితో పలు రకాల డ్రింక్స్‌ను కూడా తయారు చేసి తాగుతుంటారు. దీంతో శరీరంలోని వేడి తగ్గడంతోపాటు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము. పోషకాలు కూడా లభిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల విటమిన్ ఇ, జింక్‌తోపాటు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫాస్ఫరస్ కూడా పుష్కలంగా లభిస్తాయి. అయితే వీటిలో ముఖ్యంగా తర్బూజాలను తినే విషయంలో జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదు. కేవలం డాక్టర్ సూచన మేరకు మాత్రమే తినాలి. ఇక ఏయే సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్న వారు తర్బూజాలను తినకూడదు. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. కనుక కడుపు నొప్పి ఉన్నవారు తింటే నొప్పి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీరు తర్బూజాలను తినకూడదు. అలాగే షుగర్ పేషెంట్లు కూడా తర్బూజాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ 60 నుంచి 80 మధ్య ఉంటుంది. ఈ పండ్లను తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.
అలర్జీ సమస్యలు ఉన్నవారు కూడా తర్బూజాలను తినకూడదు. ముఖ్యంగా చర్మ అలర్జీలు ఉన్నవారు కేవలం డాక్టర్ సూచన మేరకు మాత్రమే తర్బూజాలను తినాలి. లేదంటే దద్దుర్లు, దురద, వాపులు వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే సమస్యతో బాధపడుతున్నవారు కూడా తర్బూజాలను తినకూడదు. తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి.
కిడ్నీ సమస్యలు ఉ్నవారు డాక్టర్ సూచన మేరకు వీటిని తినవచ్చు. ఎందుకంటే తర్బూజాల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలపై భారం పడేలా చేస్తుంది. కాబట్టి వీరు కూడా తర్బూజాలను తినే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ సమస్యలు ఏవీ లేనివారు లేదా ఆరోగ్యవంతులు తర్బూజాలను నిర్భయంగా ఏ సీజన్‌లో అయినా సరే తీసుకోవచ్చు. వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం లేదా మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం తింటే మంచిది. కానీ పరగడుపునే మాత్రం తర్బూజాలను తినకూడదు. తింటే కడుపు ఉబ్బరం వచ్చే చాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే తర్బూజాలను తినే విషయంలో ఈ జాగ్రత్తలను పాటించడం తప్పనిసరి.