Sunflower Seeds : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పోషకాహారాల్లో పొద్దు తిరుగుడు విత్తనాలు ఒకటి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్‌లు అధికంగా ఉంటాయి. ఈ విత్తనాలలో ఉండే కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సన్‌ప్లవర్ విత్తనాలలో విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఇ, థయామిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. కనుక మనకు ఈ విత్తనాల ద్వారా పోషణ అధికంగా లభిస్తుంది. అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ విత్తనాలలో విటమిన్ ఇ, జింక్, సెలీనియం అధికంగా ఉంటాయి. కనుక వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ క్రమంలో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే అలర్జీల నుంచి బయట పడవచ్చు. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. దీంతో మనస్సు హాయిగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఇక ఈ విత్తనాలలో ఫైబర్, విటమిన్ బి3 ఉండడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే విటమిన్ బి5 గుండెను రక్షిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
ఈ విత్తనాల్లో లినోలెయిక్, ఒలేయిక్ వంటి యాసిడ్లు, సోడియం, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
వీటిలో ఉండే బీటా సిటోస్టెరాల్, ఫైటోస్టెరాల్ వంటి మూలకాలు రొమ్ము క్యాన్సర్ నుండి కాపాడుతాయి. ట్యూమర్ కణాలను పెరగకుండా చూస్తాయి. దీంతో ట్యూమర్ పరిమాణం తగ్గుతుంది. క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఈ విత్తనాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించడంలో పొద్దు తిరుగుడు విత్తనాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ విత్తనాలలో ఉండే మినరల్స్ రక్తంలోని చక్కెర స్థాయిలని నియంత్రిస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
ఈ విత్తనాలలో ఉండే విటమిన్ బి6 మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. దీంతోపాటు ఏకాగ్రత, ఙ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఫలితంగా మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. చిన్నారులు ఈ విత్తనాలను తింటే చదువుల్లో బాగా రాణిస్తారు. తెలివి తేటలు పెరుగుతాయి.
ఇక అధిక బరువు తగ్గడానికి కూడా ఈ విత్తనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. అతిగా ఆకలి సమస్య ఉన్నవారు ఈ విత్తనాలను తింటే ఫలితం ఉంటుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా మేలు జరుగుతుంది. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు.
పొద్దు తిరుగుడు విత్తనాల్లో థయామిన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ను శక్తిగా మారుస్తుంది. అందువల్ల గుప్పెడు పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ తీసుకుంటే శరీరంలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నీరసం, నిస్సత్తువ తగ్గుతాయి. శారరీక శ్రమ, వ్యాయామం అధికంగా చేసేవారు ఈ విత్తనాలను తింటే శక్తిని త్వరగా పుంజుకుంటారు. దీంతో ఎంత పనిచేసినా అలసిపోరు.
ఇక రక్తహీనతతో బాధ పడే వారికి ఈ విత్తనాలు ఎంతో దోహదం చేస్తాయి. వీటిల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ తింటే శరీరం మొత్తం శుభ్రంగా మారుతుంది. వ్యర్థాలు బయటకు పోతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. గర్భిణీలు ఈ విత్తనాలను తింటే వారికి, కడుపులో ఉండే శిశువుకు విటమిన్ ఇ లభిస్తుంది. ఇది వారి పెరుగుదలకు దోహదపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి.
కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు ఈ విత్తనాలను తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
అయితే పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. కానీ రోజూ గుప్పెడుకు మించి తినరాదు. అధికంగా తింటే మలబద్దకం, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే చర్మంపై దద్దుర్లు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. శరీరంపై వాపులు వస్తాయి. ఇక అధికంగా ఈ విత్తనాలను తింటే కిడ్నీలకు హాని కలుగుతుంది. బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వీటిని రోజుకు గుప్పెడు వరకు మాత్రమే తినాలి. అంతకు మించి తినరాదు.