ఖరీదైన బిజినెస్ క్లాస్ లో కూర్చున్న ఒక యువకుడికి ఎయిర్ హోస్టెస్ విస్కీ తీసుకు వెళ్లి ఇచ్చింది. వద్దన్నాడు. వైన్ తీసుకుంటారా అని అడిగింది. వద్దన్నాడు. అతడు చాలా పెద్ద పారిశ్రామికవేత్త అని ఆమెకు తెలుసు. అలాంటి కష్టమర్ని ఇంప్రెస్ చేద్దామని మరింత ఖరీదైన విస్కీ తీసుకొని వచ్చింది. నేను తాగను. వద్దు అన్నాడు సుతారంగా తిరస్కరిస్తూ. ఎప్పుడూ తాగరా? ఎందుకు? అని అడిగింది.
ఈ గ్లాస్ తీసుకెళ్లి మీ పైలెట్ కి ఇవ్వు. ఆయన తాగితే నేను తాగుతాను అన్నాడు. మా పైలెట్ డ్యూటీలో ఉన్నారు అంది ఆ మాత్రం తెలీదా అన్నట్టు. అయితే ఏం? అని అడిగాడు.
హోస్టెస్ కాస్త విసుగ్గా, డ్యూటీ లో ఉన్నప్పుడు తాగకూడదు. తాగరు అంది. అదే ఏం – అని అడుగుతున్నా. విమానం నడుపుతున్నప్పుడు ఎంతోమంది ప్రయాణికుల బాధ్యత ఆయన మీద ఉంటుంది.
ఎగ్జాట్లీ. నా కుటుంబ బాధ్యత, నా మీద ఆధారపడ్డ పాతిక వేలమంది ఉద్యోగుల భవిష్యత్తు కూడా అలాగే నా మీద ఉంది. నేనా డ్యూటీ 24 గంటలూ చెయ్యాలి. అందుకని తాగను అన్నాడు ఆ యువ పారిశ్రామికవేత్త.