ఒక పావురాల గుంపు మసీదులో పైభాగంలో నివాసం ఏర్పరచుకున్నాయి . రంజాన్ పండుగ వచ్చింది . మసీదు ముస్తాబు అవుతున్నది . బూజు ,దుమ్ము దులిపేటప్పుడు పావురాల గుంపు అక్కడినుండి హిందూ దేవాలయానికి మకాం మార్చాయి. గుడి అంతర్భాగం లో మకాం పెట్టాయి . ఇంతలో దసరా పండుగ వచ్చింది . ఆ అలంకరణలో మళ్ళీ పావురాలు ఎగిరిపోయి చర్చి లో కుదురుకున్నాయి . క్రిస్టమస్ వచ్చేసరికి మళ్ళీ మసీదుకి మారాయి .ఒకనాడు మసీదు ముందు మత ఘర్షణలు చెలరేగాయి . అప్పుడే ఎదుగుతున్న చిన్ని పావురం తల్లిని అడిగింది. ఎవరు ఆ తన్నుకునేది అని .తల్లి పావురం చెప్పింది వాళ్ళు మనుషులు‘ అని.
ఎందుకు తన్నుకుంటున్నారు ?. మసీదుకి వెళ్ళేవాళ్ళు ముస్లింలు . గుళ్ళకు వెళ్లేవాళ్లు హిందువులు . చర్చికి వెళ్లేవాళ్లు క్రైస్తవులు . ఇది హిందూ ముస్లిం ఘర్షణ. చిన్ని పావురం ఆశ్చర్యంగా అంది. మనం కూడా మసీదుకి , గుడికి , చర్చికి తిరిగాం కదా ! మనం ఎక్కడైనా పావురాలమే . మరి మనుషులు కూడా ఎక్కడికి వెళ్ళినా మనుషులే కదా ? తల్లి పావురం నవ్వింది .
మనం వారికంటే ఎత్తు లో ఉన్నాం . విశాల విశ్వం మనది.స్వేఛ్ఛా ప్రపంచం మనది. అన్ని జీవుల కంటె మేధావి అయిన మానవుడు కుల, ,మత,జాతి,లింగ,వర్గ గోడలు నిర్మించుకొన్నాడు.అవి పోగొట్టుకొంటేనే వారు మన ఎత్తు కు ఎదుగుతారు.ఈ ఘర్షణలు అంతరిస్తాయి అంటూ తూర్పు వైపుగా విహంగయానం చేస్తున్న మరో గుంపు ను తదేకంగా చూస్తూ ఉండిపోయింది.