చూయింగ్ గమ్‌లను ఎక్కువగా తింటున్నారా..? అయితే జాగ్రత్త..! ఎందుకంటే వాటిలో ఉండే ఓ రకమైన రసాయనం మన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందట. ముఖ్యంగా చిన్న ప్రేగులపై ఆ కెమికల్ ప్రభావం ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, బింగమ్‌టన్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు కొందరు చూయింగ్ గమ్ – జీర్ణవ్యవస్థపై దాని ప్రభావం అనే అంశంపై ఇటీవల పరిశోధనలు చేశారు. అందులో తెలిసిందేమిటంటే…
చూయింగ్ గమ్‌లలో టైటానియం డయాక్సైడ్ అనే ఓ రసాయన సమ్మేళనం ఉంటుందట. అయితే ఎప్పుడో ఒక చూయింగ్ గమ్ చొప్పున తింటే ఏం కాదు కానీ, అదే పనిగా చూయింగ్ గమ్‌లు నమిలితే దాంతో సదరు టైటానియం డయాక్సైడ్ ఎక్కువగా జీర్ణాశయంలోకి వెళ్తుంది. అనంతరం అది చిన్నప్రేగుల వద్దకు వెళ్లి అక్కడే పొరలా వ్యాపిస్తుంది. అనంతరం మనం తిన్న ఆహారం నుంచి పోషకాలు విడిపోయి చిన్నప్రేగుల ద్వారా అవి శోషించుకోబడే సమయంలో అప్పుడు ఈ టైటానియం డయాక్సైడ్ వాటికి అడ్డు పడుతుందట. ఫలితంగా మన శరీరానికి కావల్సిన కీలకపోషకాలైన ఐరన్, జింక్, ఫ్యాటీ యాసిడ్లు చేరవని తెలిసింది. అవి శరీరంలోకి చేరకుండా నేరుగా బయటికి వెళ్లిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో చూయింగ్ గమ్‌లు ఎక్కువగా తినేవారిలో పోషకాహార లోపం తలెత్తి తద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ టైటానియం డయాక్సైడ్ వల్ల కేవలం పోషకాహార లోప సమస్య మాత్రమే కాదు… దీని వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మందగిస్తుందని సదరు సైంటిస్టులు చెబుతున్నారు. జీర్ణాశయంతోపాటు పేగుల్లో పుండ్లు పడి, వాపులకు గురయ్యేందుకు కూడా అవకాశం ఉంటుందట. దీంతో అల్సర్లు వస్తాయని అంటున్నారు. అంతేకాదు, శరీర మెటబాలిజం కూడా నెమ్మదించి తద్వారా థైరాయిడ్ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుందట. బరువు కూడా పెరిగేందుకు చాన్స్ ఉంటుందని చెబుతున్నారు. కనుక చూయింగ్ గమ్‌లను ఎక్కువగా తినే అలవాటు ఉన్నవారు దాన్ని మానుకుంటే మంచిదని సైంటిస్టులు సలహా ఇస్తున్నారు.