ఎవరైనా ప్రముఖులు అమరులైనప్పుడు సాధారణంగా వారికి సంతాప సూచకంగా 2 నిమిషాల మౌనం పాటించడం చూస్తూనే ఉంటాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. గాంధీ వంటి స్వతంత్ర సమరయోధులు, ఇతర ప్రముఖుల జయంతులు, వర్ధంతులకు మౌనం పాటిస్తూ ఉంటారు. అయితే ఈ మౌనం పాటించడానికి కారణం ఏమిటి? అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కాన్సెప్ట్ ఎవరిది అనే విషయాలు తెలుసుకుందాం. సుమారు 300 ఏళ్ల కిందట సౌత్ ఆఫ్రికాలోని కెప్టెన్ క్రిస్టియన్ ఉద్యమం జరిగినప్పుడు ఈ సాంప్రదాయం ప్రారంభమైంది.
అప్పట్లో ఈ ఉద్యమంలో చనిపోయిన వారి త్యాగానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ 2 నిమిషాల పాటు మౌనం పాటించేవారు. ఇక మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సర్ పెర్షి ఫిట్జ్ ప్యాట్రిక్ ఒకసారి కింగ్ జార్జ్ వి కి మౌనం పాటించడంపై సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన కామన్వెల్త్ రిమెంబరెన్స్ డేస్ ఉత్సవాలు జరుపుకోవాలని ప్రారంభించారు. అలా కింగ్ జార్జ్ ఆదేశాల మేరకు అమర జవాన్ల త్యాగానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ 2 నిమిషాల మౌనం పాటించడం మొదలుపెట్టారు. అలా ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. అప్పటినుండి అనేక దేశాలు ఈ పద్ధతిని అనుసరించడం మొదలుపెట్టాయి.
అయితే ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఆయా దేశాలు శాంతి చర్చలతో యుద్ధాన్ని ముగిస్తే అప్పుడు ఆ దేశాలు కూడా 2 నిమిషాల పాటు మౌనం పాటించాలనే కొత్త సిద్ధాంతాన్ని ఆస్ట్రేలియాకు చెందిన జర్నలిస్టు ఎడ్వార్డు జార్జ్ హని సూచించాడు. కానీ ఈ సిద్ధాంతాన్ని ఎవరూ పాటించలేదు. కాకపోతే సొంత దేశానికి చెందిన జవాన్లు యుద్ధంలో చనిపోతే వారికోసం 2 నిమిషాలు మౌనం పాటించడం మొదలుపెట్టారు. ఇక చనిపోయిన వారు ప్రముఖులు అయితే వారికి గౌరవ సూచకంగా కూడా 2 నిమిషాలు మౌనం పాటిస్తారు.