Addasaram : అడ్డసరం.. ఔషధ గుణాలు కలిగిన మొక్కలల్లో ఇది ఒకటి. ఈ మొక్క మనకు ఎక్కువగా గ్రామాల్లో కనబడుతుంది. దీనిని ఔషధ గని అని ఆయుర్వేద వైద్యులు అభివర్ణిస్తూ ఉంటారు. గ్రామాల్లో ప్రజలు ఈ మొక్కను చూసినప్పటికి అది ఔషధ మొక్క అని వారికి తెలిసి ఉండదు. చాలా మంది దీనిని పిచ్చి మొక్కగానే భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఈ మొక్కను విరివిరిగా ఉపయోగిస్తారు. ఈ మొక్కను సంస్కృతంలో వాసక, వైద్యమాత, అటరూష అని హిందీలో అడూస, విసోంట అని పిలుస్తారు.
అడ్డసరం మొక్కను ఏ విధంగా ఉపయోగించడం వల్ల మనం ఏయో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అడ్డసరం ఆకుల రసం 5 గ్రాములు, తులసి ఆకుల రసం 5 గ్రాములు, తేనె 5 గ్రాములు కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే అన్న రకాల దగ్గులు తగ్గు ముఖం పడతాయి. అడ్డసరం ఆకుల రసం 20 గ్రాములు, తేనె 5 గ్రాములు కలిపి రోజూ రెండు పూటలా సేవిస్తూ ఉంటే క్రమంగా క్షయ తగ్గుతుంది. కామెర్ల వ్యాధిని తగ్గించే గుణం కూడా అడ్డసరం మొక్కకు ఉంది. అడ్డసరం ఆకులను దంచి తీసిన రసాన్ని 15 గ్రాములు, తేనె 20 గ్రాములు కలిపి మూడు పూటలా సేవిస్తూ ఉంటే కామెర్ల వ్యాధి పది రోజుల్లో తగ్గు ముఖం పడుతుంది. అడ్డసరం ఆకులు మరియు వాటి వేర్లపై ఉండే బెరడును కలిపి పొడిగా చేసుకోవాలి.
ఈ పొడిని పొగ తాగే గొట్టంలో వేసి దాని పొగ పీలుస్తూ ఉంటే ఉబ్బసం తగ్గు ముఖం పడుతుంది. అలాగే పాండు రోగాన్ని తగ్గించడంలో కూడా అడ్డసరం ఆకుల రసం మనకు ఉపయోగపడుతుంది. 10 గ్రా. అడ్డసరం ఆకుల రసం, 10 గ్రా. ధనియాలు, కరక్కాయ బెరడు 10 గ్రా. ల మోతాదులో తీసుకుని దంచాలి. వీటిని అర లీటర్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని వడకట్టుకుని దానిలో ఒక టీ స్పూన్ కండ చక్కెర కలుపుకుని తాగుతూ ఉంటే పాండురోగం తగ్గిపోతుంది. దగ్గుతో పాటు నోటి నుండి రక్తం పడే రక్తపిత్తం సమస్యతో బాధపడే వారు కూడా మనలో చాలా మంది ఉండే ఉంటారు. అలాంటి వారు 20 గ్రా. అడ్డసరం ఆకుల రసం, 10 గ్రా. కండచక్కెర పొడి, 5 గ్రా. తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే రక్తపిత్తం సమస్య తగ్గుతుంది.
అల్లం రసం 20 గ్రాములు, అడ్డసరం ఆకుల రసం 20 గ్రా. మోతాదులో కలిపి మూడు రోజుల పాటు రెండు పూటలా తాగుతూ ఉంటే గొంతులో పేరుకుపోయిన శ్లేష్మం కరిగిపోతుంది. అడ్డసరం ఆకులు, పసుపు సమానంగా కలిపి తగినంత గోమూత్రంతో మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని దురదలపై రాసి ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. ఈ విధంగా అడ్డసరం మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.