Kalakand Payasam : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో కలాకంద్ కూడా ఒకటి. పాలతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ స్వీట్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ ను నేరుగా తినడంతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. కలాకంద్‌తో చేసే ఈ పాయసం కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ కలాకంద్ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కలాకంద్ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – అర కప్పు, పెసరపప్పు – అర కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు, పాలు – అర కప్పు, జీడిపప్పు – 8, బాదం పప్పు – 5, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, కలాకంద్ బిళ్లలు – 4, కండెన్స్డ్ మిల్క్ – 400 ఎమ్ ఎల్.
కలాకంద్ పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పు, బియ్యం వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి గంటకు పైగా నానబెట్టుకోవాలి. తరువాత వీటిని ఒక కుక్కర్ లో వేసి తగనన్ని నీళ్లు పోయాలి. కుక్కర్ మూతను ఉంచి మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పాలు, జీడిపప్పు, బాదం, గసగసాలు వేసి అర గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి చిన్న మంటపై 4 నిమిషాల కలుపుతూ ఉడికించాలి.
తరువాత ఇందులో మూడు కలాకంద్ బిళ్లలను నలిపి వేసుకుని కలపాలి. తరువాత కండెన్స్డ్ మిల్క్ వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మరో కలాకంద్ బిళ్లను నలిపి పైన చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కలాకంద్ పాయసం తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా కలకందతో పాయసం తయారు చేసుకుని తినవచ్చు. దీనిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.