Paneer Matar Masala : పాలతో చేసే పదార్థాలల్లో పనీర్ ఒకటి. పనీర్ లో కూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పనీర్ తో చేసే వంటకాలు రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పనీర్ తో చేసే వివిధ రకాల వంటకాల్లో పనీర్ మటర్ మసాలా కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ కూరను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పనీర్ మటర్ మసాలా కూరను ధాబా స్టైల్ లో రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు.. ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ మటర్ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
పనీర్ – పావు కిలో, బఠాణీ కాయలు – పావుకిలో, తరిగిన ఉల్లిపాయ – 2, తరిగిన టమాటాలు – 3, తరిగిన పచ్చిమిర్చి – 3, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పనీర్ మటర్ మసాలా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి సగానికి పైగా వేగిన తరువాత టమాట ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా ఉడికించాలి. తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో బటర్, నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత బఠాణీ గింజలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బఠాణీ గింజలను మెత్తగా ఉడికించాలి.
తరువాత పనీర్ ముక్కలను వేసి కలపాలి. మరలా మూతను ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కసూరి మెంతి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పన్నీర్ మటర్ మసాలా తయారవుతుంది. దీనిని చపాతీ, పుల్కా, నాన్, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పనీర్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూరను కూడా చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.