Holy Basil For Hair Growth : చెట్లను పూజించే సాంప్రదాయం మన భారత దేశంలోనే చూడవచ్చు. మనం నిత్యం పూజించే చెట్లల్లో తులసి చెట్టు ఒకటి. హిందూ సంప్రదాయంలో తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన పురాణాల్లో కూడా తులసి చెట్టు విశిష్టత గురించి వివరించబడింది. తులసి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మన ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడడంలో తులసి చెట్టు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో దీనిని ఔషధంగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. తులసి ఆకులను నోట్లో వేసుకుని నమలడం వల్ల నోటిపూత, అల్సర్లు, ఇతర ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. తులసి ఆకులతో చేసిన డికాషన్ ను తాగడం వల్ల తలనొప్పి వెంటనే తగ్గుతుంది. రోజూ ఒక తులసి ఆకును తింటే నాడులకు టానిక్ లా పని చేస్తుంది.
అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. ప్రతిరోజూ మిరియాలు, ధనియాలు, తులసి ఆకులు కలిపి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు ఈ మిశ్రమాన్ని తినడం వల్ల కడుపులో నులి పురుగులు కూడా నశిస్తాయి. తులసి ఆకులకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం ఉంది. దీంతో తులసి ఆకులు డయాబెటిస్ ఉన్న వారికి చక్కగా పని చేస్తాయి. రెండు స్పూన్ల తులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. తులసి ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ముఖాన్ని ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ముఖం పై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మంతో పాటు జుట్టు సంరక్షణకు కూడా తులసి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి.
వయసుతో సంబంధం లేకుండా వచ్చే జుట్టు సమస్యలను తులసి ఆకులు అరికడతాయి. అయితే తులసి ఆకులను జుట్టు కొరకు ఎలా వాడాలి.. ఎలా వాడితే జుట్టు రాలడం తగ్గుతుంది అనే విషయాలను తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో తులసి ఆకుల పొడిని తీసుకోవాలి. తరువాత అందులో ఉసిరికాయల పొడిని కలపాలి. ఇప్పుడు దీనిలో నీరు పోసి పేస్ట్ లా చేయాలి. అలాగే ఈ పేస్ట్ లో కొద్దిగా మెంతులు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజూ ఈ మిశ్రమాన్ని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ తరువాత దానిలో బాదం నూనెను కానీ, గోరు వెచ్చగా వేడి చేసిన కొబ్బరి నూనెను కానీ కలపాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను కుదళ్లకు బాగా పట్టించాలి. కుదుళ్లకు ఈ మిశ్రమాన్ని ఎంత బాగా పట్టిస్తే అంతలా ఫలితం ఉంటుంది.
ఒక గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా నెలకు ఒకసారి చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. ఇతర జుట్టు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఈవిధంగా తులసి ఆకులు మనకు ఎంతగానో మేలు చేస్తాయని వీటిని ఉపయోగించడం వల్ల మనం అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.