Ramassery Idli : మనం ఉదయం పూట అల్పాహారంగా తీసుకునే వాటిల్లో ఇడ్లీలు ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీలను కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తయారు చేస్తారు. అలాగే కేరళ రాష్ట్రంలో రామసెర్రి ప్రాంతంలో చేసే ఇడ్లీలు చాలా ప్రత్యేకమైనవి. సాంప్రదాయ పద్దతుల్లో చేసే ఈ ఇడ్లీలు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ ఇడ్లీల తయారీ విధానం సాధారణం కంటే కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ ఇడ్లీలను సులభమైన పద్దతిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రామసెర్రి ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – అర కప్పు, మెంతులు – పావు టీ స్పూన్, ఇడ్లీ బియ్యం – ఒక కప్పు, సాధారణ బియ్యం – ఒక కప్పు, ఉప్పు – తగినంత.
రామసెర్రి ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును, మెంతులను వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. మరో గిన్నెలో ఇడ్లీ బియ్యం, సాధారణ బియ్యం వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి వీటిని కూడా నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తరువాత మినపప్పును జార్ లో వేసి తగినన్ని చల్లటి నీటిని పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని కూడా అదే గిన్నెలో వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి పిండిని 6 నుండి 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. పిండి పులిసిన తరువాత అందులో తగినంత ఉప్పును వేసి కలపాలి. ఇప్పుడు ఒక మట్టి పాత్రలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక దానిపై సన్న రంధ్రాలు ఉన్న జల్లెడను ఉంచాలి.
తరువాత దానిపై శుభ్రమైన కాటన్ వస్త్రాన్ని ఉంచాలి. ఈ కాటన్ వస్త్రంపై రెండు నుండి మూడు గంటెల పిండిని వేసి కొద్దిగా పలుచగా రుద్దాలి. తరువాత ఆవిరి బయటకు పోకుండా దానిపై గిన్నెను ఉంచి ఇడ్లీని ఉడికించాలి. ఇడ్లీ ఉడికిన తరువాత దానిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రామసెర్రి ఇడ్లీలు తయారవుతాయి. వీటి తయారీలో సన్న రంధ్రాలు ఉన్న జల్లెడకు బదులుగా పుల్కాల పెన్నాన్ని కూడా వాడవచ్చు. ఈ ఇడ్లీలు మనం తరచూ చేసుకునే ఇడ్లీల లాగా కాకుండా ఊతప్పం ఆకారంలో కొద్దిగా మందంగా ఉంటాయి. మట్టి కుండలో పోసిన నీటి నుండి వచ్చిన ఆవిరితో ఈ ఇడ్లీలను ఉడికించడం వల్ల వీటికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఈ ఇడ్లీలను కారం పొడి, లేదా నచ్చిన చట్నీతో కలిపి తినవచ్చు.