కరివేపాకు.. కూరల్లో కరివేపాకు కనబడగానే మనలో చాలా మంది ఠక్కున ఏరిపారేస్తూ ఉంటారు. వంటల తయారీలో మనం విరివిరిగా కరివేపాకును ఉపయోగిస్తూ ఉంటాం. కరివేపాకును ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మన పెరట్లో ఉండే కరివేపాకుతో మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. కరివేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.
తరచూ కరివేపాకును తీసుకోవడం వల్ల ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. ప్రతిరోజూ పరగడుపున కరివేపాకులను తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడే వారు పరగడుపున ప్రతిరోజూ కరివేపాకును తినడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గుతారు. ఒక టీ స్పూన్ కరివేపాకు రసానికి సమానంగా తేనెను కలిపి తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొవ్వు చేరకుండా ఉంటుంది. అజీర్తి సమస్యతో బాధపడే వారు కరివేపాకును, జీలకర్రను పొడిగా చేసి పాలల్లో కలుపుకుని తాగడం వల్ల తిన్న ఆహారం తేలికగా జీర్ణమయ్యి అజీర్తి సమస్య తగ్గుతుంది.
మజ్జిగలో కరివేపాకు రసం, నిమ్మ రసం కలిపి తాగడం వల్ల గ్యాస్ సమస్య తగ్గు ముఖం పడుతుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారికి కరివేపాకు చక్కని ఔషధంలా పని చేస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు తరచూ కరివేపాకును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. షుగర్ వ్యాధి త్వరగా అదుపులోకి వస్తుంది. కరివేపాకును మెత్తగా నూరి గాయాలపైన రాయడం వల్ల ఎటువంటి గాయమైనా త్వరగా మానుతుంది. అధిక చెమటతో బాధపడే వారు కరివేపాకును కచ్చా పచ్చాగా దంచి మజ్జిగలో వేసి కలిపి తాగడం వల్ల అధిక చెమట సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
కరివేపాకులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ లు సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఏదో ఒక రూపంలో కరివేపాకును తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. కరివేపాకులో అధికంగా ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కరివేపాకు పొడికి పసుపును కలిపి జల్లించి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల అలర్జీ వంటి చర్మ సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. కరివేపాకును మెత్తగా నూరి తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు రాలడం ఆగడంతోపాటు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
కరివేపాకును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తలకు పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. కంటి చుట్టూ నల్లని వలయాలు ఉన్న వారు పెరుగులో కరివేపాకు రసాన్ని కలిపి రాస్తూ ఉండడం వల్ల కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలు తొలగిపోతాయి.
కరివేపాకును తరచూ తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే నెలసరి సమస్యలు నయం అవుతాయి. కరివేపాకు రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో రెండు పూటలా తీసుకోవడం వల్ల మూత్ర పిండాల సమస్యలు తొలగిపోతాయి. ఈ విధంగా కరివేపాకు మనకు ఎంతో మేలు చేస్తుందని, కరివేపాకును ఏరిపారేయకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.