Lemon Water : మనలో చాలా మంది ఉదయాన్నే పరగడుపునే నిమ్మకాయ నీళ్లను తాగుతుంటారు. కొందరు నిమ్మరసాన్ని సేవిస్తారు. కొందరు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసంతోపాటు తేనెను కలిపి తాగుతుంటారు. అయితే ఆరోగ్యం కోసం ఇలా తాగడం మంచిదే. కానీ నిమ్మకాయ నీళ్లను పరగడుపునే తాగితే మంచిదేనా.. ఏదైనా హాని కలుగుతుందా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. ఎందుకంటే నిమ్మరసం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. కనుక నిమ్మరసాన్ని పరగడుపునే తాగితే జీర్ణాశయంలో ఇబ్బందులు వస్తాయని భావిస్తుంటారు. అయితే ఇందుకు నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసాన్ని పరగడుపునే తాగడం వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా మన శరీరంలో ఉండే విష పదార్థాలు అన్నీ బయటకు పోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి లభిస్తుంది. మనకు రోజుకు అవసరం అయ్యే విటమిన్ సిలో 51 శాతం వరకు విటమిన్ సి ని ఒక నిమ్మకాయతో మనం పొందవచ్చు. దీంతో శరీరానికి పోషణ లభిస్తుంది. అలాగే రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. చలికాలంలో నిమ్మరసం తాగడం వల్ల మేలు పొందవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం, పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ తేనె కలిపి తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. చలి నుంచి రక్షణ లభిస్తుంది.
ఈ సీజన్‌లో మనకు దగ్గు, జలుబు, ఇతర గొంతు సమస్యలు వస్తాయి. కానీ నిమ్మరసం తాగితే అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థ శుభ్రమవుతుంది. శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుంది. ఇది ఆస్తమా పేషెంట్లకు మేలు చేస్తుంది. ఉదయాన్నే పరగడుపునే నిమ్మరసం సేవించడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మెటబాలిజం పెరగడంతోపాటు అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతోపాటు షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారు పరగడుపునే నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.
అయితే పరగడుపునే నిమ్మరసం సేవించడం వల్ల ఏదైనా హాని కలుగుతుందా.. అంటే.. ఏమీ కలగదు. కానీ గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు మాత్రం దీన్ని పరగడుపున తాగరాదు. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుంది. కనుక ఈ సమస్యలు ఉన్నవారు నిమ్మరసాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఇక మిగిలిన ఎవరు అయినా సరే నిమ్మరసాన్ని నిరభ్యంతరంగా తాగవచ్చు. అయితే నిమ్మరసం దంతాలను పదే పదే తాకితే దంతాలపై ఉండే సున్నితమైన ఎనామిల్ పొర కరిగిపోయే అవకాశం ఉంటుంది. కనుక దంతాలకు తాకకుండా నిమ్మకాయ నీళ్లను తాగాలి. నిమ్మరసాన్ని నేరుగా తాగకుండా దాన్ని నీటిలో కలిపి తాగాలి. ఇలా సేవిస్తే.. ఎలాంటి హాని కలగదు. కనుక నిమ్మరసాన్ని, నిమ్మకాయ నీళ్లను తాగడం ఉన్న అపోహలను వీడండి. ఉదయాన్నే తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.