Honey Warm Water : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే తేనెను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. తేనెతో పలు రకాల ఔషధాలను కూడా తయారు చేస్తారు. కొన్ని రకాల ఔషధాలను, మూలికలను తేనెతో తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు కూడా సూచిస్తుంటారు. దీని వల్ల ఔషధాలు చక్కగా పనిచేస్తాయి. అయితే తేనెను రోజు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. తేనెను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని తాగితే అనేక లాభాలు కలుగుతాయి.
తేనె కలిపిన గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం అన్నది ఉండదు. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు, షుగర్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. ఇంకా ఎన్నో లాభాలు మనకు తేనె, గోరు వెచ్చని నీటి వల్ల కలుగుతాయి. అయితే ఈ నీళ్లను ఉదయం లేదా రాత్రి.. ఎప్పుడు తాగితే మంచిదని చాలా మంది సందేహిస్తుంటారు. అందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె కలిపిన గోరు వెచ్చని నీటిని రోజులో ఉదయం లేదా రాత్రి ఎప్పుడైనా సరే తాగవచ్చు. ఉదయం తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా నీరసంగా, అలసటగా ఉందని అనుకునే వారు ఈ నీళ్లను ఉదయం తాగితేనే మంచిది. ఇక రాత్రి పూట ఈ నీళ్లను తాగడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. అయితే తేనె నీళ్లను ఏ సమయంలో తాగాలి అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. తమకు ఉన్న సమస్యలను బట్టి ఉదయం లేదా రాత్రి ఎప్పుడైనా సరే తేనె నీళ్లను తాగవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.