Standing On Single Leg : మనిషికి రెండు కాళ్లు ఉంటాయి. కనుక రెండు కాళ్లతోనే నిలబడ్డా, నడిచినా, ఏ పనైనా చేయాల్సి ఉంటుంది. ఒక్క కాలితో ఏ పని చేయరాదు. అయితే ఒంటికాలితో నిలబడడం గురించి మీరు వినే ఉంటారు. పూర్వం తపస్సు చేసుకునే మునులు ఒంటికాలిపై నిలబడే తపస్సు చేసేవారు. కానీ మీకు తెలుసా.. ఒంటి కాలిపై మీరు నిలబడే సమయాన్ని బట్టి మీరు ఇంకా ఎన్నేళ్లు జీవిస్తారో ఇట్టే చెప్పేయవచ్చట. అవును, మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని సైంటిస్టులు పలు అధ్యయనాల ద్వారా తాజాగా వెల్లడించారు.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితం అయిన ఓ అధ్యయనం ప్రకారం.. సైంటిస్టులు 51 నుంచి 75 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న కొందరి వివరాలను సేకరించి విశ్లేషించారు. వీరు ఒంటికాలిపై ఎంత సమయం పాటు నిలబడ్డారు అన్న అంశం ఆధారంగా అధ్యయనం చేశారు. అయితే చివరకు సైంటిస్టుల విశ్లేషణలో తేలిందేమిటంటే.. 10 సెకన్లు లేదా అంతకన్నా తక్కువ సేపు ఒంటికాలిపై నిలబడిన వారు వచ్చే 10 ఏళ్లలో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేల్చారు.
అంటే ఒంటి కాలిపై ఎంత ఎక్కువ సేపు నిలబడగలిగే కెపాసిటీ ఉంటే అన్ని ఎక్కువ ఏళ్లపాటు ఎవరైనా జీవిస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఒక వ్యక్తి గరిష్టంగా ఎన్నేళ్లు జీవించగలడు అనే విషయం కేవలం ఇదే కాదు, ఇంకా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, ఇది కేవలం నామమాత్రపు అధ్యయనం మాత్రమేనని అన్నారు. ఒక వ్యక్తికి ఉండే ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేసే సమయం, నిద్రించే సమయం, అతనికి ఉన్న వ్యాధులు తదితర అంశాల ఆధారంగా ఒక వ్యక్తి ఆయుష్షు నిర్ణయించబడుతుందని చెబుతున్నారు.
అయితే ఎవరైనా సరే ఎక్కువ ఏళ్ల పాటు జీవించాలంటే రోజూ తగినంత నిద్ర పోవాలి. తగినన్ని నీళ్లను తాగాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. మాంసాహారం తక్కువగా తినాలి. మద్యం మానేయాలి, పొగ తాగకూడదు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నట్స్, విత్తనాలను రోజూ తీసుకోవాలి. ఇలాంటి జీవనశైలిని ఎవరైనా పాటిస్తే వారు ఎక్కువ రోజుల పాటు జీవించే అవకాశాలు అధికంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక మీరు కూడా ఆయుర్దాయం ఎక్కువ కావాలంటే ఈ తరహా జీవనశైలిని పాటించండి.