technology

మీ ఇంట్లో వైఫై సిగ్నల్స్ సరిగ్గా రావ‌డం లేదా..? అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!

ఒక‌ప్పుడంటే ఇంటర్నెట్ కావాలంటే ఎక్క‌డో దూరంలో ఉన్న సైబ‌ర్ కేఫ్‌కు వెళ్లాల్సి వ‌చ్చేది కానీ ఇప్పుడ‌లా కాదు. ఇంట్లోనే చాలా మంది ఇంటర్నెట్ క‌నెక్ష‌న్ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతోపాటుగా వైఫై రూట‌ర్‌ను కూడా పెట్టుకుని ఎంచ‌క్కా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌, ల్యాప్‌టాప్ వంటి అన్ని డివైస్‌ల‌లోనూ ఇంట‌ర్నెట్‌ను వైర్‌లెస్‌గా అందుకుంటున్నారు. దాంతోపాటు అన్ని ప‌నుల‌ను చ‌క్క బెట్టుకుంటున్నారు. అయితే వైఫై రూట‌ర్‌లు చాలా సంద‌ర్భాల్లో బాగానే ప‌నిచేసినా కొన్ని సార్లు మాత్రం మ‌న‌కు ఇబ్బందుల‌ను సృష్టిస్తుంటాయి. అందుకు చాలా కార‌ణాలు ఉంటాయి. దీంతో మ‌న‌కు ఇంటర్నెట్ స‌రిగ్గా అంద‌దు. లేదంటే స్పీడ్ రాదు. అయితే వైఫై రూట‌ర్‌తో ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుని హై స్పీడ్ ఇంట‌ర్నెట్‌ను వాడుకోవాలంటే అందుకు కింద ఇచ్చిన కొన్ని సూచ‌న‌ల‌ను పాటించాలి. అంతే, మీ రూట‌ర్ ఇంత‌కు ముందు క‌న్నా ఇంకా బాగా ప‌నిచేస్తుంది. ఈ క్రమంలో ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది వైఫై రూట‌ర్‌ను తేగానే దాన్ని సెట‌ప్ చేసి కంప్యూట‌ర్ ప‌క్క‌నో లేదంటే క‌రెంటు ప్ల‌గ్‌ల‌కు ద‌గ్గ‌ర‌గానో పెడ‌తారు. ఇంకా కొంద‌రు షెల్ఫ్‌లు లేదంటే బాగా చాటుగా ఉన్న ప్ర‌దేశాల్లో వైఫై రూట‌ర్‌ను పెడుతుంటారు. కానీ అలా చేయ‌డం వ‌ల్ల వైఫై రూట‌ర్ సిగ్న‌ల్ త‌గ్గుతుంది. దీంతో నెట్ స్పీడ్ స‌రిగ్గా రాదు. అలాంట‌ప్పుడు ఏం చేయాలంటే వైఫై రూట‌ర్‌ను వీలైనంత ఎత్తులో ఉంచాలి. దీంతో అన్ని డివైస్‌ల‌కు సిగ్న‌ల్స్ స‌రిగ్గా అంది నెట్ స్పీడ్‌గా వ‌స్తుంది. కాంక్రీట్‌, లోహాలు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను వైఫై రూట‌ర్ల వ‌ద్ద ఉంచ‌కూడ‌దు. ఎందుకంటే అవి ఉంటే వైఫై సిగ్న‌ల్స్ స‌రిగ్గా రావు. దీంతో నెట్ స్పీడ్ కూడా త‌గ్గుతుంది. క‌నుక ఎలాంటి వ‌స్తువులు లేని ఖాళీ ప్ర‌దేశంలో వైఫై రూట‌ర్‌ను పెట్టుకోవాలి.

how to boost wifi signal in your home

వైఫై రూట‌ర్ నుంచి వైర్‌లెస్ సిగ్న‌ల్స్ 360 డిగ్రీల కోణంలో వెళ్తుంటాయి. క‌నుక రూట‌ర్‌ను ఇంటికి ఏదైనా ఒక చివ‌ర పెట్టే కంటే ఇంటి మ‌ధ్య‌లో పెడితే ఇంట్లో అన్ని డివైస్‌ల‌కు వైఫై స‌రిగ్గా అందుతుంది. అయిన‌ప్పటికీ సిగ్న‌ల్ స‌రిగ్గా రాక‌పోతే వైఫై రిపీట‌ర్స్ వాడాలి. ఇవి మ‌న‌కు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌వుతున్నాయి. వీటిని పెట్టుకుంటే వైఫై సిగ్న‌ల్ కొంత వ‌ర‌కు పెరుగుతుంది. రేడియో సిగ్న‌ల్స్‌ను ఎక్కువ‌గా విడుద‌ల చేసే స్మార్ట్‌ఫోన్లు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌కు వైఫై రూటర్ల‌ను దూరంగా పెట్టాలి. దీంతో సిగ్న‌ల్ కొంత ఇంప్రూవ్ అవుతుంది. మైక్రోవేవ్ ఓవెన్స్‌ తెలుసుగా. చాలా అధిక ఉష్ణోగ్ర‌త‌ల వ‌ద్ద ఆహారాల‌ను వండుతారు. వాటి నుంచి వైర్‌లెస్ త‌రంగాలు 2.45 గిగాహెడ్జ్ రేంజ్‌లో వ‌స్తుంటాయి. అయితే వైఫై రూట‌ర్లు కూడా 2.412 నుంచి 2.472 రేంజ్‌లో వైర్‌లెస్ త‌రంగాలు విడుద‌ల చేస్తాయి. క‌నుక రెండింటినీ ప‌క్క ప‌క్క‌న ఉంచితే ఆ రెండు త‌రంగాలు క్రాష్ అయ్యి వైఫై స‌రిగ్గా రాదు. క‌నుక ఓవెన్స్ నుంచి వైఫై రూట‌ర్లను దూరంగా పెట్టాలి. అప్పుడే సిగ్న‌ల్ స‌రిగ్గా వ‌స్తుంది.

కేవ‌లం ఓవెన్స్ మాత్ర‌మే కాదు, అన్ని ర‌కాల బ్లూటూత్ ప‌రిక‌రాలు పైన చెప్పిన విధంగా వైర్‌లెస్ త‌రంగాలు విడుద‌ల చేస్తాయి. క‌నుక బ్లూటూత్ ప‌రిక‌రాల‌కు కూడా వైఫై రూట‌ర్ల‌ను దూరంగా ఉంచాలి. అలంక‌ర‌ణ‌ల కోసం వాడే చిన్న‌పాటి ఎల్ఈడీ లైట్ల వ‌ల్ల కూడా వైఫై సిగ్న‌ల్స్ డౌన్ అవుతాయి. వాటి నుంచి కూడా వైఫై రూటర్ల‌ను దూరంగా ఉంచాలి. కంప్యూట‌ర్ల‌లో వైఫైతో పెద్ద పెద్ద సైజ్ క‌లిగిన ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేస్తున్న‌ప్పుడు స‌హ‌జంగానే సిగ్న‌ల్స్ డౌన్ అవుతాయి. డౌన్‌లోడ్ ఆప‌గానే మ‌ళ్లీ సిగ్న‌ల్ పెరుగుతుంది. క‌నుక దీనిపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. ఎక్కువ మంది జ‌నాలు ఉన్న చోట కూడా వైఫై స‌రిగ్గా రాదు. ఎందుకంటే మ‌నుషుల్లో 60 శాతం నీరే ఉంటుంది క‌దా. అది కూడా సిగ్న‌ల్స్‌పై ప్ర‌భావం చూపుతుంది. క‌నుక మ‌నుషులు ఎవ‌రూ లేక‌పోతేనే సిగ్న‌ల్ బాగా పెరుగుతుంది.

Admin

Recent Posts