Regi Chettu : రేగి పండ్లు… ఇవి మనందరికీ తెలుసు. మనలో చాలా మంది వీటిని ఇష్టపడతారు. ఉష్ణమండల ప్రాంతాలలో ఇవి ఎక్కువగా పెరగుతాయి. రేగి పండ్లు తీపి, పులుపు రుచిని కలిగి ఉంటాయి. రేగి పండ్ల రంగు, రుచి, పరిమాణాన్ని బట్టి దాదాపుగా 90 రకాల రేగి పండ్లు ఉన్నాయి. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ రేగి పండ్లు మనకు ఎంతగానో సహాయపడతాయి. రక్త హీనత, గొంతు నొప్పి, నీరసం, శ్వాస నాళాల వంటి సమస్యలను రేగి పండ్లు నివారిస్తాయి. భోగి పండగ నాడు పిల్లలకు భోగ భాగ్యాలు కలగలాని ఈ పండ్లను పోస్తారు. భోగి నాడు పోస్తారు కాబట్టి వీటిని భోగి పండ్లు అంటారు. ఈ చెట్లు త్వరగా పెరిగి పెట్టిన మూడేళ్లలోనే ఇవి మనకు పండ్లను ఇస్తాయి.
రేగి పండ్లల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. రేగి పండ్లు తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. గొంతు నొప్పిని తగ్గించే గుణాన్ని కూడా ఈ రేగు పళ్లు కలిగి ఉంటాయి. రేగి పండ్ల గింజలను పొడిగా చేసి నువ్వుల నూనెను కలిపి రాసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రేగి పండ్ల బెరడును నీటిలో వేసి కషాయంగా చేసుకుని తాగడం వల్ల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. రేగి పండ్ల గుజ్జుతో వడియాలను కూడా తయారు చేస్తారు. గుప్పెడు రేగి పండ్లను తీసుకుని అర లీటర్ నీటిలో వేసి అవి సగం అయ్యే వరకు మరిగించి ఆ నీటికి తేనెను కానీ, పంచదారను కానీ కలిపి రాత్రి పడుకునే ముందు తాగుతూ ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. జలుబు, జ్వరం, డయేరియా, శూల నొప్పి, రక్త విరేచనాలను అరికట్టడంలో రేగి పండ్ల కషాయం ఉపయోగపడుతుంది. దీనిని తాగడం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.
రేగి ఆకులను నూరి చర్మం పై రాసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. బరువు పెరగడంలో, శరీరానికి శక్తిని ఇవ్వడంలో, కండరాలకు బలాన్ని ఇవ్వడంలో కూడా రేగి పండ్లు దోహదపడతాయి. రేగి పండ్లతో చేసిన టానిక్ ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయ పని తీరు మెరుగుపడుతుంది. రేగి పండ్లను తినడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. ఆకలి లేమి, నీరసం వంటి సమస్యలు నయం అవుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. రేగి పండ్ల విత్తనాలను నిద్రలేమి సమస్యకు ఉపయోగిస్తారు. ఈ చెట్టు వేరు పొడిని గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.
రేగి చెట్టు వేర్లతో, బెరడుతో చేసి కషాయాన్ని తీసుకోవడం వల్ల కీళ్ల వాపులు తగ్గుతాయి. ఈ కషాయాలను తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు. రేగి చెట్లు పెరగడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. కానీ ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కూడా ఇవి పెరుగుతాయి. 7 నుండి 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఇవి వేడిని తట్టుకుంటాయి. ఈ విధంగా రేగి పండ్లను, బెరడును ఉపయోగించడం వల్ల మనం అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.