Gaju Theega Mokka : మన చుట్టూ అనేక రకాల మొక్కలు ఉంటాయి. కొన్ని మొక్కలకు కాసిన కాయలు ఎంతో రుచిగా ఉంటాయి. వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియకపోయినప్పటికీ ఆ కాయలను మనం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. ఇలా ఎంతో రుచిగా ఉండే, ఆరోగ్యానికి మేలు చేసే కాయలను ఇచ్చే మొక్కల్లో.. గాజు తీగ మొక్క కూడా ఒకటి. దీనిని అడవి ద్రాక్ష మొక్క, బుబటి తీగ మొక్క అని కూడా అంటారు. చెరువుల దగ్గర, తోటకు, పొలాలకు వేసే కంచెలకు, రేగి చెట్లకు ఈ తీగ మొక్క ఎక్కువగా అల్లుకుని పెరుగుతుంటుంది. ఈ మొక్క కాయలు ఎంతో అందంగా ఉంటాయి. వీటిని నొక్క గానే ఒక రకమైన శబ్దం వస్తుంది.
ఈ కాయల్లో నానబెట్టిన సబ్జా గింజల మాదిరి గింజలు ఉంటాయి. పూర్వకాలంలో గాజు తీగ మొక్క కాయలను ఎంతో ఇష్టంగా తినేవారు. ఈ కాయలను తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ తీగ మొక్కలు మనకు విరివిరిగా కనిపిస్తూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తీగ మొక్కలు వ్యాపించి ఉన్నాయి. ఈ కాయలను తినడానికి పక్షులు కూడా ఇష్టపడతాయి. ముఖ్యంగా రామ చిలుకలు వీటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. గాజు తీగ మొక్క ఆకులు యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. గాయాలు తగిలినప్పుడు ఈ మొక్క ఆకులను దంచి రసాన్ని తీసి ఆ రసాన్ని గాయాలపై వేయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలో కూడా ఈ మొక్క మనకు సహాయపడుతుంది.
ఈ తీగ మొక్క ఆకులను సేకరించి దంచి ఆ మిశ్రమాన్ని చర్మంపై రాయడం వల్ల గజ్జి, తామర వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడే వారు చాలా మందే ఉన్నారు. ఈ సమస్య నుండి బయటపడడానిక అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ నిద్రలేమి సమస్యను నయం చేయడంలో కూడా ఈ గాజు తీగ మొక్క ఉపయోగపడుతుంది. గాజు తీగ మొక్క ఆకులను ఎండబెట్టి కచ్చా పచ్చగా దంచి వాటితో కషాయాన్ని చేసుకుని రోజూ రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల నిద్ర త్వరగా పడుతుంది. తలనొప్పితో బాధపడే వారు ఈ మొక్క లేత ఆకులను సేకరించి వాటికి మూడు లేదా నాలుగు మిరియాలను కలిపి దంచి ముద్దగా చేసి ఆ మిశ్రమాన్ని నుదుటి మీద రాసి తలకు కట్టుకట్టుకోవడం వల్ల తలనొప్పి త్వరగా తగ్గుతుంది. ఈ విధంగా గాజు తీగ మొక్కను ఉపయోగించి అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.