Millettia Pinnata : గ్రామాలలో, రోడ్లకు ఇరు వైపులా ఎక్కువగా ఉండే చెట్లలో కానుగ చెట్టు ఒకటి. ఈ చెట్టు మనందరికీ తెలిసిందే. కానీ ఇది ఒక ఔషధాల గని అని, ప్రకృతి ప్రసాదించిన వరం అని మాత్రం ఎవరికీ తెలియదు. కానుగ చెట్టులో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కానుగ చెట్టును ఉపయోగించుకుని మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేద నిపుణులు కూడా కానుగను ఉపయోగించి చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంటారు. కానుగ చెట్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కానుగ చెట్టు గింజల నుండి తీసిన నూనెను ఉపయోగించి అనేక రకాల చర్మ సంబంధమైన సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ చెట్టు ఆకుల రసం దగ్గు, డయేరియా వంటి వాటిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కానుగ చెట్టు పూలను నెయ్యిలో వేయించి తీసుకోవడం వల్ల కడుపులో మంట, గ్యాస్, అజీర్తి వల్ల వచ్చే వాంతులు తగ్గుతాయి. కానుగ ఆకులను తులసి ఆకుల రసం, తేనెను కలిపి తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి. ఎండాకాలంలో కానుగ చెట్ల కింద నిలబడడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. ఎండ వల్ల కలిగే అలసట, నీరసం కూడా త్వరగా తగ్గుతాయి.
పైల్స్ తో బాధపడే వారికి కానుగ ఆకులు ఎంతో సహాయపడతాయి. కానుగ ఆకులను మెత్తగా నూరి పైల్స్ ఉన్న భాగంలో రాయడం వల్ల వీటి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. లేత కానుగ ఆకులను ముద్దగా నూరి నువ్వుల నూనె, ఆవు నెయ్యిలో వేయించి, వేయించిన గోధుమ పిండిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీర్ణాశయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
కానుగ నూనెకు న్యుమోనియా, బ్రాంకైటిస్, కీళ్ల నొప్పులను తగ్గించే సామర్థ్యం ఉంది. కానుగ ఆకులతో ఆవాలను చేర్చి మెత్తగా నూరి అందులో సైంధవ లవణాన్ని కలిపి పూతగా రాయడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు తగ్గుతాయి. హైడ్రోసిల్, ఆర్కైటిస్ వంటి వ్యాధులను తగ్గించడంలోనూ కానుగ చెట్టు ఉపయోగపడుతుంది. కానుగ చెట్టు బెరడును, సైంధవ లవణం, ఆవాలతో చేర్చి లేపనంగా చేసి బోదకాలుపై కట్టడం వల్ల బోదకాలు వల్ల వచ్చిన వాపు, నీరు తగ్గుతాయి.
వేసవి కాలంలో చాలా మందికి వేడి వల్ల శరీరంలో గడ్డలు వస్తుంటాయి. అలాంటి వారు కానుగ వేరును మెత్తగా నూరి సెగ గడ్డపై ఉంచి కట్టుగా కట్టడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది. కానుగ వేళ్ల రసంతో గాయాలను, పుండ్లను తరచూ శుభ్రం చేయడం వల్ల అవి త్వరగా మానుతాయి. కానుగ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసి ఆ కషాయంతో తరుచూ ముక్కును శుభ్రం చేసుకోవడం వల్ల సైనుసైటిస్ తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా కానుగ చెట్టు ప్రతి భాగాన్ని ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.