Pacha Karpuram : తీపి పదార్థాల తయారీలో వాడే వాటిల్లో పచ్చ కర్పూరం ఒకటి. పచ్చ కర్పూరాన్ని వాడడం వల్ల మనం తయారు చేసే ఆహార పదార్థాల రుచి ఎంతగానో పెరుగుతుంది. ముఖ్యంగా లడ్డూల తయారీలో దీనిని వాడడం వల్ల లడ్డూ రుచి, వాసన కూడా పెరుగుతాయి. అయితే ఆయుర్వేదంలో పచ్చ కర్పూరాన్ని ఎంతగానో ఉపయోగిస్తారు. పచ్చ కర్పూరాన్ని ఉపయోగించి అనేక రకాల అనారోగ్య సమస్యలను మనం నయం చేసుకోవచ్చు. పచ్చ కర్పూరానికి మనం దేవునికి హారతి ఇవ్వడం కోసం వాడే కర్పూరానికి చాలా తేడా ఉంటుంది. హారతి కోసం వాడే కర్పూరాన్ని వివిధ రకాల రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తూ ఉంటారు. దీనిని వాడడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. పచ్చ కర్పూరాన్ని చెట్టు నుండి తయారు చేస్తారు. దీనిని ఉపయోగించి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
కీళ్ల నొప్పులను, కండరాల నొప్పులను సహజంగా తగ్గించడంలో పచ్చ కర్పూరం ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెను వేడి చేసి అందులో పచ్చ కర్పూరాన్ని వేసి కరిగించి ఆ నూనెను నొప్పి ఉన్న చోట రాయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నొప్పులు త్వరగా తగ్గుతాయి. పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పిని కూడా పచ్చ కర్పూరాన్ని వాడి తగ్గించుకోవచ్చు. పచ్చ కర్పూరం నూనెలో దూదిని ముంచి ఆ దూదిని పిప్పి పన్ను మీద ఉంచడం వల్ల నొప్పి తగ్గుతుంది.
పచ్చ కర్పూరాన్ని ఉపయోగించి సాధారణంగా వచ్చే జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. గంధాన్ని నూరి అందులో పచ్చ కర్పూరాన్ని కరిగించి ఆ మిశ్రమాన్ని నుదుటి మీద రాయడం వల్ల సాధారణంగా వచ్చే జ్వరం తగ్గుతుంది. ఈ మిశ్రమాన్ని ఉపయోగించి జ్వరంతోపాటు చర్మంపై ఉండే దురదలను, దద్దుర్లను కూడా తగ్గించుకోవచ్చు. బ్రాంకైటిస్, ఆస్తమా వంటి శ్వాస సంబంధమైన సమస్యలను తగ్గించడంలో కూడా పచ్చ కర్పూరం ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో పచ్చ కర్పూరాన్ని కరిగించి వేడి చేసి ఛాతిపై రాస్తూ మర్దనా చేయాలి. తరువాత వేడి నీటితో కాపడం పెట్టడం వల్ల శ్వాస సంబంధమైన సమస్యలు తగ్గుముఖం పడుతాయి.
కడుపులో పురుగులు, అజీర్తి సమస్యలను కూడా పచ్చ కర్పూరాన్ని ఉపయోగించి నయం చేసుకోవచ్చు. రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి అందులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో పురుగులు నశిస్తాయి. స్నానం చేసే నీటిలో పచ్చ కర్పూరాన్ని వేసి స్నానం చేయడం వల్ల చర్మం ఎల్లపుడూ తాజాగా సువాసనను వెదజల్లుతూ ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.