Moringa Tree : మన నిత్య అవసరాలను, మన ఆకలిని తీర్చుకోవడానికి మనం అనేక రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. అయితే మనం తీసుకునే కూరగాయల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయని మనలో చాలా మందికి తెలిసి ఉండదు. ఇలా ఆకలిని తీర్చడంతో పాటు ఔషధంగా ఉపయోగపడే కూరగాయల్లో మునక్కాయ ఒకటి. మునక్కాయలతో పాటు మునగ చెట్టు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగ చెట్టును ఎన్నో రకాల ఔషధాల తయారీలో విరివిరిగా ఉపయోగిస్తున్నారు. ఇంటి చిట్కాల్లో కూడా ఈ మునగచెట్టును విరివిరిగా ఉపయోగిస్తారు. మునగ చెట్టు వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మునగాకులను ఏ రూపంలో తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మునగాకులను తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాహార లోపం సమస్య తలెత్తకుండా ఉంటుంది. మల్టీ విటమిన్స్ ను ఉపయోగించే అవసరం రాకుండా ఉంటుంది. ఈ మునగాకుల పొడి మనకు ప్యాకెట్ రూపంలో, ట్యాట్లెట్ల రూపంలో బయట మార్కెట్ లో లభ్యమవుతుంది. ఈ పొడిని బయట అధిక ధరలకు కొనుగోలు చేయడానికి బదులుగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
మునగాకులను శుభ్రపరిచి ఎండబెట్టి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఈ పొడితో కారం పొడిని, కషాయాన్ని చేసుకుని తీసుకోవడం వల్ల విటమిన్ల లోపం సమస్య తలెత్తకుండా ఉంటుంది. కంటి చూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు 20 ఎమ్ ఎల్ మోతాదులో మునగాకు రసాన్ని తేనెతో కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రేచీకటి సమస్య తగ్గుతుంది. అలాగే ఈ మునగాకును మెత్తగా నూరి ఆముదంలో వేసి గోరు వెచ్చగా అయ్యే వరకు వేడి చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కొవ్వు గడ్డలపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల క్రమంగా కొవ్వు గడ్డలు కరిగిపోతాయి. అలాగే చాలా మంది పురుషులు బుడ్డ, వృషణాలు కిందికి జారిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు మునగాకులను ఆముదంలో వేడి చేసి వృషణాలపై ఉంచి గోచి లాగా కట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల క్రమక్రమంగా ఆయా సమస్యల నుండి బయటపడవచ్చు. మునగ పూలను మెత్తగా నూరి దాని నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని పురుషులు తీసుకోవడం వల్ల వారిలో లైంగిక శక్తి పెరుగుతుంది.
నపుంసకత్వం తగ్గుతుంది. అలాగే మునగాకులతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల ఎక్కిళ్లు తగ్గిపోతాయి. మునగ చెట్టు బెరడును 20 గ్రాముల మోతాదులో తీసుకుని 300 ఎమ్ ఎల్ నీటిలో వేసి సగం అయ్యే వరకు మరిగించి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయంలో త్రికటు చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల ప్లీహ రోగాలు తగ్గుతాయి. మునగాకులను కూర రూపంలో లేదా ఔషధ రూపంలో తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే మునగాకు బెరడును ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని 5 గ్రాముల మోతాదులో తేనెతో కలిపి తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే గర్భాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మునగ చెట్టు వేరు బెరడును మెత్తగా దంచి చర్మంపై లేపనంగా రాయడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయి.
మునగ చెట్టు నుండి వచ్చే బంకను సేకరించి గోరు చుట్టు వచ్చిన వేలుపై రాయడం వల్ల గోరు చుట్టు సమస్య తగ్గుతుంది. మునగచెట్టు బెరడుతో కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల గుండె బలంగా తయారవుతుంది. మునగ చెట్టు వేరుతో చేసిన కషాయాన్ని తీసుకుంటూ మునగ గింజల నుండి తీసిన నూనెను రాసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మునగాకు వేరు బెరడుకు సమానంగా ఆవాలను కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని పక్షవాతం వల్ల పడిపోయిన శరీర భాగాలకు లేపనంగా రాస్తూ ఉండడం వల్ల ఆ భాగాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. అయితే దేశవాళీ మునగచెట్టును ఉపయోగించడం వల్ల మాత్రమే మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని మునగచెట్టును ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.