Parijatha Tree : మన చుట్టూ అనేక రకాల పూలు పూసే మొక్కలు ఉంటాయి. అయితే కొన్నిరకాల పూలను మాత్రమే మనం దైవ పూజకు ఉపయోగిస్తాం. ఎక్కువగా దైవ పూజకు ఉపయోగించే పూలల్లో పారిజాతం పూలు కూడా ఒకటి. దైవ పూజకు కోసం వీటిని ప్రత్యేకంగా పెంచేవారు కూడా ఉన్నారు. వీటిని ఆంగ్లంలో నైట్ ఫ్లవర్ జాస్మిన్ అని పిలుస్తారు. ఈ పూలు చూడడానికి ఎంతో అందంగా ఉండడంతోపాటు చక్కని వాసనను కూడా కలిగి ఉంటాయి. ఈ పూలు రాత్రి మాత్రమే వికసించి తెల్లవారు జాము వరకు రాలిపోతూ ఉంటాయి.
మనం సాధారణంగా దైవారాధనకు చెట్టు మీద నుండి పూలను సేకరిస్తాం. కానీ పారిజాతాలను చెట్టు నుండి కోయకూడదని అవి కింద పడిన తరువాతే వాటిని సేకరించి దేవుడికి సమర్పించాలని, ఆ విధంగా ఈ చెట్టు దేవుడి నుండి వరం పొందిందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి పవిత్ర వృక్షంలో ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పారిజాతం చెట్టులో ఉన్న ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పారిజాతం చెట్టు గింజలను ఎండబెట్టి పొడిలా చేసుకోవాలి. ఈ పొడికి కొద్దిగా నీటిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు పట్టించడం వల్ల తలలో వచ్చే కురుపులు, పుండ్లు తగ్గుతాయి. ఈ గింజల చూర్ణానికి కొబ్బరి నూనెను కలిపి తలకు రాసుకుని ఒక గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. పారిజాతం చెట్టు ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ఆముదంలో వేసి చిన్న మంటపై వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని వాతపు నొప్పులపై ఉంచి కట్టుకట్టడం వల్ల నొప్పులు తగ్గుతాయి.
పారిజాతం చెట్టు గింజలను మట్టిపాత్రలో వేసి నల్లగా అయ్యే వరకు వేడి చేయాలి. తరువాత ఈ గింజలను పొడిగా చేసి దానికి హారతి కర్పూరం పొడిని, కొబ్బరి నూనెను కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. పారిజాత చెట్టును ఎక్కడ పడితే అక్కడ పెంచకూడదు. ఈ చెట్టు పూలను ఎవరూ తొక్కకుండా దాని కంటూ ప్రత్యేక స్థానాన్ని కేటాయించి పెంచుకోవాలి. ఈ విధంగా పారిజాతం చెట్టు మనకు దైవారాధనకు, అలాగే ఔషధంగా గానూ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.