ఈమధ్య కాలంలో చాలా మంది పిడుగుపాటుకు మరణిస్తున్నారు. మన దేశంలో కూడా ఇటీవల వర్షాకాలంలో చాలా మంది పిడుగుపాటుకు బలయ్యారు. కాగా పెరులోని హువాన్‌కాయో అనే ప్రాంతంలో ఓ మైదానంలో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్ విషాదంగా ముగిసింది. అక్కడ పిడుగు పడడంతో ఒక ప్లేయర్ అక్కడికక్కడే తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. మరికొందరికి గాయలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
పెరులోని హువాన్‌కాయోలో జువెంటుడ్ బెల్లవిస్టా, ఫమిలియా చొక్కా అనే రెండు జట్ల మధ్య రీజనల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో బెల్లవిస్టా జట్టు 2-0 గోల్స్‌తో ఆధిక్యంలో ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో రిఫరీ వెంటనే మ్యాచ్‌ను ఆపేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే కొన్ని క్షణాల్లోనే ఆ మైదానంలో పిడుగు పడింది. కొందరు ప్లేయర్లు పిడుగు పడే సమయంలో మైదానంలో పడుకున్నారు. కానీ కొందరు ఇంకా నిలబడే ఉన్నారు. వారిపై పిడుగు పడింది. దీంతో క్రజ్ మీజా (39) అనే ప్లేయర్‌పై పిడుగు పడి అతను తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని పక్కన ఉన్న కొందరికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
కాగా వారు ఫుట్‌బాల్ ఆడుతున్న ప్రాంతం సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఉంటుందట. అలాంటి ప్రదేశంలో ఔట్ డోర్ గేమ్స్ లేదా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు రక్షణ చర్యలు చేపట్టాలని, అలా చేపట్టి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఇక ఆ సమయంలో తీసిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు సైతం షాకవుతున్నారు.