గతేడాది.. అంటే 2023వ సంవత్సరం మే 19వ తేదీన ఆర్‌బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించిన విషయం విదితమే. అయితే గతంలో పెద్ద నోట్లను రద్దు చేసినట్లు కఠిన నియమాలు పెట్టలేదు. దీంతో ప్రజలందరూ సజావుగానే తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను మార్పిడి చేసుకున్నారు. అయితే ఇంకా చాలా వరకు నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్‌బీఐ తాజాగా వెల్లడించింది. అక్టోబర్ 31వ తేదీ వరకు చాలా వరకు రూ.2000 నోట్లు తమకు చేరాయని, కానీ ఇంకా రూ.6,970 కోట్ల విలువైన నోట్లు సర్క్యులేషన్‌లోనే ఉన్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది.
మే 19, 2023వ తేదీ వరకు సర్క్యులేషన్‌లోని రూ.2000 నోట్లు రూ.3.56 లక్షలు ఉండగా, అక్టోబర్ 31వ తేదీ వరకు వాటి విలువ రూ.6,970 కోట్లకు దిగి వచ్చిందని పేర్కొంది. ఈ క్రమంలోనే మొత్తం 98.04 శాతం వరకు నోట్లు తిరిగి వెనక్కి వచ్చినట్లు ఆర్‌బీఐ తెలియజేసింది. ఇంకా కొన్ని నోట్లు మాత్రం ప్రజల వద్దే ఉన్నాయని వెల్లడించింది.
అయితే రూ.2000 నోట్లు ఉన్నవారు ఇప్పుడు మార్పిడి చేసుకుంటామంటే బ్యాంకుల్లో కుదరదు. అక్టోబర్ 7, 2023 వరకే గడువు ఇచ్చారు. ఆ తరువాత నుంచి నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ శాఖలను సంప్రదించాల్సి ఉంటుంది. కనుక మీ దగ్గర కూడా ఏవైనా రూ.2000 నోట్లు ఇంకా ఉంటే మీకు సమీపంలో ఉన్న ఆర్‌బీఐ శాఖను సంప్రదించి ఆ నోట్లను మార్పిడి చేసుకోవచ్చు.