యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయి. అయితే దాదాపుగా అన్ని ఆసనాలను ఉదయాన్నే పరగడుపునే వేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క ఆసనాన్ని మాత్రం తిన్న తరువాత వేయవచ్చు. అదే వజ్రాసనం. దీన్నే ఇంగ్లిష్‌లో థండర్‌బోల్ట్ పోజ్ అంటారు.
వజ్రసనాన్ని భోజనం చేశాక కూడా వేయవచ్చు. భోజనం చేశాక ఈ ఆసనం వేస్తేనే లాభాలు కలుగుతాయి. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే..?
* సౌకర్యవంతంగా, నిటారుగా కూర్చోవాలి.
* రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.
* ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను వెనక్కి మడవాలి.
* వెనుక వైపు అరికాళ్లు పైకి కనపడేలా ఉంచుకోవాలి.
* మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.
* వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలను సరిసమానంగా ఉంచాలి.
* రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.
* రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.
* తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.
* వజ్రాసనంలో ఉన్నంతసేపు నిటారుగా ఉండాలి.
ఈ ఆసనాన్ని 30 సెకన్లతో మొదలుపెట్టి 15 నిమిషాల వరకు వేయచ్చు. ఓపిక ఉన్నంత సేపు ఈ ఆసనంలో ఉండవచ్చు. కాల పరిమితి ఏమీ లేదు. ఇబ్బందిగా అనిపిస్తే కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్లీ చేయవచ్చు. భోజనం చేశాక మధ్యాహ్నం, సాయంత్రం రెండు పూటలా ఈ ఆసనం వేయవచ్చు. దీంతో కింద తెలిపిన లాభాలు కలుగుతాయి.
* వజ్రాసనం వేయడం వల్ల జీర్ణవ్యవస్థ పటిష్టంగా మారుతుంది.
* మలబద్దకం సమస్య ఉండదు.
* జీర్ణాశయం, పేగుల్లో ఉండే అల్సర్లు మాయమవుతాయి.
* అసిడిటీ, గ్యాస్ ఉండవు.
* వెన్నెముక దృఢంగా మారుతుంది.
* వెన్నె నొప్పి, సయాటికా ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది.
* పెల్విక్ కండరాలు దృఢంగా మారుతాయి.
* మహిళలకు రుతు సమయంలో నొప్పులు తగ్గుతాయి.
* పొట్ట దగ్గరి కొవ్వును కరిగించే ఆసనాలతో ఈ ఆసనం కలిపి వేస్తే ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ ఆసనాలను ఉదయం వేయాలి కనుక అప్పుడే ఈ ఆసనాన్ని కూడా వేయవచ్చు.