Temple : సాధారణంగా ఆలయాలకు చాలా మంది తరచూ వెళ్తుంటారు. ఆలయానికి వెళ్లగానే ముందుగా దైవానికి ప్రదక్షిణ చేస్తారు. తరువాత లైన్‌లో నిలుచుని స్వామివారు, అమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం అక్కడ కాసేపు గడిపి బయటకు వస్తారు. అయితే కొందరు మాత్రం ఆలయానికి వెళ్లినప్పుడు పలు తప్పులను చేస్తుంటారు. దీంతో ఆలయానికి వెళ్లిన పుణ్యం దక్కదు. పైగా చెడు ప్రభావాలు కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఆలయాలకు వెళ్లినప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ కొన్ని పనులను చేయరాదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయాలకు ఎప్పుడూ జడ వేసుకుని వెళ్లాలి. పురుషులు అయితే శుభ్రంగా తల దువ్వుకుకుని పోవాలి. అంతేకానీ జుట్టు విరబోసుకోని వెళ్లరాదు. ఆడవాళ్లు తప్పని సరిగా జడ వేసుకోవాలి. ఆలయానికి వెళ్లిన తరువాత తలపై ధరించిన వస్రాన్ని తొలగించాలి. మనం దేవాలయాలనికి చెప్పులు వేసుకుని వెళతాం. మొదటగా ఆ చెప్పులను బయట విడిచి కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లాలి. తరువాత ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం కుడి పక్క నుండి ఆలయంలోకి ప్రవేశించాలి.
ఆలయ క్షేత్ర పాలకుడికి మొదటగా నమస్కారం చేయాలి. ఆలయంలో దేవునికి తప్ప ఇతరులకు నమస్కరించరాదు. పూజారికి కూడా నమస్కరించ రాదు. ఇలా నమస్కారం చేయడం వల్ల ఆలయ దర్శన ఫలితం రాదని పండితులు చెబుతున్నారు. మనం తీసుకెళ్లిన వస్తువులను దేవుడికి సమర్పించి ఒక పక్కకు నిలబడాలి. దేవుడికి, క్షేత్ర పాలకునికి మధ్యలో అస్సలు నిలబడరాదు. పూజారి శఠ గోపం పెట్టేటప్పుడు తలను తాకరాదు. మనం తలను తాకి అదే చేత్తో తీర్థ, ప్రసాదాలను తీసుకున్నప్పుడు వెంట్రుకలకు ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
మనం స్వీకరించిన ప్రసాదాన్ని ఆలయ పరిసరాలలో కింద పడేయరాదు. పూజ ముగిసిన తరువాత ఆలయంలో కొద్ది సమయం దేవుడికి వీపు చూపించకుండా కూర్చోవాలి. ఆలయంలో ఎట్టి పరిస్థితులోనూ గోళ్లు కొరక రాదు. మన గోళ్లు కానీ, జుట్టు కానీ ఆలయ పరిసరాలలో పడితే మనకు సకల పాపాలు చుట్టుకుంటాయని పండితులు చెబుతున్నారు. ఆలయంలో పెద్దగా నవ్వడం కానీ, మాట్లాడడం కానీ, అరవడం కానీ చేయరాదు. దీని వల్ల ఆలయ ప్రశాంతత దెబ్బ తింటుంది. ఆలయ పరిసరాలలో తొందరగా నడవడం, పరిగెత్తడం వంటివి చేయరాదు. ఆలయంలో అస్సలు ఆవలించరాదు. ఆలయంలో కూర్చున్నంత సేపు దేవుడిపై దృష్టి కేంద్రీకరించాలి. ఇలా చేస్తూ తరుచూ ఆలయాలను దర్శించడం వల్ల మన జీవితాలలో ప్రశాంతత నెలకొంటుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆలయాలను సందర్శించిన పుణ్యఫలం లభిస్తుంది.