ఆధ్యాత్మికం

అయ్యప్ప స్వాములు కట్టే ఇరుముడి గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు తెలుసా.? అందులో ఏముంటాయి? అర్ధం ఏంటి?

ఇరుముడి కట్టు…శబరిమలెక్కు… కార్తీకమాసంలో అయ్యప్ప మాల వేసుకున్న వారు.. తమ దీక్షముగిసిన తర్వాత ఇరుముడిని నెత్తిన పెట్టుకుని, మోసుకుపోతుంటారు ..శబరి లో ఉన్న అయ్యప్పస్వామిని దర్శించుకుని అక్కడ మాల తీస్తారు..దీక్షలో ఉన్న 41రోజులు చాలా నియమాలతో,నిష్టగా ఉంటారు.ఇరుముడి అంటే రెండు అరలు ఉన్న మూట…ఇంతకీ ఆ ఇరుముడిలో ఏముంటుంది అని మీకెప్పుడైనా డౌటొచ్చిందా.. ఇరుముడి ముందు ముడిలో ఆవునెయ్యి, కొబ్బరికాయలు, బియ్యం, పసుపు, కుంకుమ, జాకెట్టు, విభూతి, పన్నీరు, అగరుబత్తి, కర్పూరం, తేనె, ఖర్జూరము, బెల్లము, మిరియాలు, జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు, పేలాలు ఉంచుతారు.వెనుక ముడిలో పప్పులు, ఉప్పు, చింతపండు, మిరప్పొడి, ఆవాలు, ఇంగువ, తినేందుకు తయారు చేసిన పదార్థాలు ఉంచి ఇరుముడిని కడతారు.

గురుస్వామి కట్టే ఇరుముడిని సాక్షాత్తూ శ్రీ అయ్యప్పస్వామి స్వరూపంగా కొలుస్తారు. ఇరుముడి కట్టే సమయంలో, దానిని శిరముపై ధరించేటప్పుడు, చివరకు సన్నిధానం చేరే వరకూ స్వామి శరణుఘోషతోనే ఇరుముడిని శిరముపై ధరించాలి. ఇలా కట్టిన ఇరుముడులను గురుస్వామి తన స్వహస్తాలతో శిష్యుల శిరముపై పెట్టి శబరిమల యాత్రకు తీసుకెళ్తారు. అయ్యప్పస్వామి దర్శనం అయిన తర్వాత ఇరుముడులను ఒకచోటికి చేర్చి, భక్తి శ్రద్ధలతో పూజించి ఒక్కొక్క ఇరుముడిని విప్పి అందులోని వస్తువులను స్వామివారికి సమర్పించేందుకు గురుస్వాములు సిద్ధం చేస్తారు. ముద్ర టెంకాయలను పగులగొట్టి అందులోని నెయ్యిని ఒక పాత్రలో పోయించి శ్రీ స్వామివారి అభిషేకమునకు పంపుతారు. మన శరీరమును నారికేళముగా ఎంచుకొని, అహంకారమనే నారను భక్తియనే బండరాయిపై అరగదీసి, అందులోని మోహమనే జలమును తీసి, భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఆచార, అనుష్ఠానములనే జ్ఞానమృతమును (నెయ్యి) నింపి, వైరాగ్యమనే మూతను పెట్టి, ఆత్మ అనే లక్కతో ముద్రవేసి, శ్రీఅయ్యప్పస్వామి వారి సన్నిధానికి తీసుకెళ్లి అభిషేకము చేసి పునీతులు కావడం ఇందులోని పరమార్థం.

do you know what is the meaning of irumudi

అలా పగులగొట్టి నెయ్యి తీసిన కొబ్బరికాయలను గణపతి హోమగుండంలోవేస్తారు. కొబ్బరికాయలతో పాటూ పేలాలను కూడా కొందరు హోమగుండంలో వేస్తారు.
ఇరుముడిలోని కానుకలను అయ్యప్పస్వామి వారి హుండీలో వేస్తారు. ఇరుముడులు విప్పి వేరు చేయగానే విభూతి, పసుపు, కుంకుమలను వేర్వేరు పాత్రల్లో పోసి… విభూతి పళ్లెములో ఇరుముడిలోని కర్పూరమును వెలిగించి, ఆ కాంతిలో ఇరుముడులను విప్పుతారు. మిగిలిన కర్పూరమును, అగరుబత్తీలను స్వామివారి సన్నిధానంలోని కర్పూర ఆళిలో వేస్తారు. బెల్లము, ఖర్జూరము, ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు, తేనె, పేలాలు వీటన్నిటినీ కలిపి పంచామృతాభిషేకమునకు పంపుతారు. పసుపు, కుంకుమ, విభూతి, చందనం, పన్నీరు, మిరియాలు, జాకెట్టు, నల్లగాజులు వీటిని విడివిడిగా తీసుకొని ఒక్కొక్కరు ఒక్కో పళ్లెం తీసుకుని వెళ్లాలి. ప్రతి స్వామి ఒక్కో కొబ్బరికాయ తీసుకొని మాళికాపురం సన్నిధిలో దొర్లించి రావాలి. పసుపు, కుంకుమలను మాళిగైపురత్తమ్మ సన్నిధి వద్ద సమర్పించి కొచ్చుకొడుత్తస్వామిని దర్శించుకోవాలి. తెచ్చిన జాకెట్లు, నల్లగాజులు అమ్మవారికి సమర్పించాలి.

కొబ్బరికాయను ముక్కంటి సాక్షాత్కారముగా భావిస్తారు. నారతీయగానే మూడు నేత్రములు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన అన్ని ప్రదేశాల్లో కొబ్బరికాయను పగులగొట్టినా, సాక్షాత్‌ ఆదిపరాశక్తి ఆవాస స్థలమైన మాళిగైపురత్తమ్మ సన్నిధిలో శక్తితో శివుని జత కలుపు రిత్యా నారికేళమును పగులగొట్టకుండా, దొర్లించి విడిచిపెట్టుట సంప్రదాయం. అమ్మవారికి కర్పూర హారతి చూపించి, పసుపు, కుంకుమలను ప్రసాదంగా స్వీకరించి, వెనుక పక్కన ఉన్న భస్మకుళములో స్నానం చేయాలి.

సన్నిధానంలో ఇరుముడులను విప్పిన తర్వాత అందులోని బియ్యము నుంచి పిడికెడు బియ్యం అక్షింతలుగా ప్రతివారి ఇరుముడిలోనూ వేస్తారు. శబరిమల పుణ్యస్థలి నుంచి వచ్చిన ఆ బియ్యాన్ని ఇంట్లోని బియ్యముతో కలిపి ఉంచితే అక్షయ పాత్రలా తరగదని భక్తుల నమ్మకం. ఇదండీ ఇరుముడి ప్రాశస్త్యం..దీక్షముగిశాక శబరిమలైకి తీసుకువెళ్లిన స్వాములు ఇరుముడిలోని పదార్దాలతో ఏం చేస్తారో క్షుణ్ణంగా తెలుసుకున్నారు కదా…స్వామియే శరణం అయ్యప్ప…

Admin

Recent Posts