Muniyandi Temple : మటన్ బిర్యానీ అంటే సహజంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొందరు మటన్ కూర కన్నా మటన్ బిర్యానీ అంటేనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లోనూ కొందరు మటన్ బిర్యానీ పెడుతుంటారు. అయితే ఆ ఆలయంలో ప్రసాదంగా కూడా మటన్ బిర్యానీని పెడుతున్నారు. అవును మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు ఆ ఆలయం ఎక్కడ ఉంది ? దాని విశిష్టత ఏమిటి ? అంటే..
తమిళనాడులోని మదురైలో మునియంది ఆలయం ఉంది. అక్కడ ఆలయంలో మునియంది స్వామి కొలువై ఉన్నాడు. అయితే అక్కడి భక్తులు స్వామి వారికి మటన్ బిర్యానీని ప్రసాదంగా పెడతారు. దీని వెనుక ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. అదేమిటంటే..
1973లో మదురై జిల్లాలోని వడకంపట్టి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హోటల్ వ్యాపారం ప్రారంభించాడు. అది ఎంతో సక్సెస్ అయింది. దీంతో ఎంతో సంతోషం చెందిన ఆ వ్యాపారి ఆ స్వామి వారికి మటన్ బిర్యానీ వండి ప్రసాదంగా పెట్టాడు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి చాలా మంది అలా మటన్ బిర్యానీని ప్రసాదంగా పెడుతూ వస్తున్నారు. ఆ ఆచారం ఇప్పటికీ అలాగే వస్తోంది.
ఇక ప్రతి ఏడాది ఈ సమయంలో అక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు. అందులో ఎన్నో వేల మంది పాల్గొంటారు. ఈ సారి అక్కడ 8000 మంది వరకు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరూ స్వామి వారికి మటన్ బిర్యానీని ప్రసాదంగా సమర్పించారు.
ఆలయంలోనూ ఉత్సవాల సమయంలో మటన్ బిర్యానీని తయారు చేసి ప్రసాదంగా భక్తులకు పెడతారు. అందుకు గాను 4000 కిలోల బియ్యం, 100 మేకలు, 600 కోళ్లను ఉపయోగిస్తారు. కోళ్లతో కూర చేసి మటన్ బిర్యానీతో కలిపి పెడతారు.
కాగా ఈ ఆలయంలో మటన్ బిర్యానీని ప్రసాదంగా సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని, వ్యాపారం ఏది చేసినా.. అది సక్సెస్ అవుతుందని నమ్ముతుంటారు. అందుకనే చాలా మంది ఇక్కడికి వచ్చి మటన్ బిర్యానీ సమర్పిస్తుంటారు. ఇక దక్షిణ భారత దేశంలో ఈ స్వామి పేరిట 500 మునియంది హోటల్స్ ను కూడా పలు చోట్ల నిర్వహిస్తుండడం విశేషం.