తులసి ఆకుల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మన శరీరానికి తులసి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్యాలను నయం చేసే శక్తి తులసి ఆకులకు ఉంది. తులసిని చాలా మంది మహిళలు నిత్యం పూజిస్తారు కూడా. అయితే పురాణాల ప్రకారం తులసి మొక్కకు సంబంధించిన పలు విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవి. ఈ క్రమంలోనే తులసి మొక్క వెనుక దాగి ఉన్న పలు రహస్యాలను ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం విష్ణువు భార్య తులసి అని చెబుతారు. ఈ క్రమంలోనే తులసి ఆకులను నమలకూడదట. అలా చేస్తే అది అపవిత్ర కార్యం అవుతుందట. అయితే దీనికి సైన్స్ చెబుతున్న కారణం ఏమిటంటే… తులసి ఆకుల్లో మెర్క్యురీ (పాదరసం) ఎక్కువగా ఉంటుందట. ఈ క్రమంలోనే ఆ ఆకులను తింటే దాంతో ఆ పాదరసం దంతాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందట.
అందుకే వైద్యులు తులసి ఆకులను నేరుగా తీసుకోకూడదని, దాన్ని రసం రూపంలో లేదంటే ఆ ఆకులను నీటిలో మరిగించి దాని రసం తాగాలని చెబుతున్నారు. పురుషులతో పోలిస్తే స్త్రీలలో రజోగుణం ఎక్కువగా ఉంటుందట. అయితే తులసి మాత్రం సాత్విక గుణాలు కలది. ఈ క్రమంలో స్త్రీలు తులసి ఆకులను కోస్తే దాంతో ఆ ఆకుల్లో ఉండే సాత్విక గుణాలు, ఔషధ గుణాలు పోతాయట. అందుకే స్త్రీలు తులసి ఆకులను కోయకూడదట. ద్వాదశి వచ్చినప్పుడు, ఆదివారం పూట తులసి ఆకులను కోయకూడదట. అలా చేస్తే తులసి ఆకులు వారి శరీరానికి హాని చేస్తాయట. దీన్ని గురించి పద్మ పురాణంలో వివరించారు.
సాయంత్రం, రాత్రి పూట తులసి ఆకులను కోయకూడదట. అలా చేస్తే అశుభం కలుగుతుందట. కేవలం ఉదయం పూట మాత్రమే తులసి ఆకులను కోయాలట. తులసి ఆకులను కోసే ముందు ఆ మొక్కకు నమస్కారం చేసి అనంతరం తులసిని ప్రార్థించాలట. తాము ఏ కారణం కోసం ఆ ఆకులను కోస్తున్నారో ఆ కారణాన్ని తులసికి వివరించి, అనంతరం ఆమెను ప్రార్థించి అప్పుడు ఆకులు కోయాలట.