Lord Shiva : పరమ పతివ్రత అనసూయ దేవి కుమారుడు చంద్రుడు. మంచి గుణాలతో కనిపించిన చంద్రుడిని తన అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు దక్షుడు. బ్రహ్మ కుమారుడైన దక్షుడికి 27 మంది కుమార్తెలు. ఒకరిని మాత్రమే చంద్రుడికి కట్టబెట్టడం ఇష్టలేక తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు దక్షుడు. తన 27 మంది బిడ్డలందర్నీ సమానంగా చూసుకోవాలని, ఎవర్నీ బాధపెట్టొదంటూ చంద్రుని వద్ద మాట తీసుకుంటాడు దక్షుడు. అయితే కొద్ది రోజులకే చంద్రుడు మామకిచ్చిన మాట తప్పుతాడు.
రోజుకొక్కరి చొప్పున 27 మంది భార్యల వద్ద గడిపే చంద్రుడికి పెద్ద భార్య రోహిణి అంటే చాలా ఇష్టం. దీని కారణంగా మిగితా 26 మందిని సరిగ్గా పట్టించుకునేవాడు కాదంట చంద్రుడు. ఇదే విషయాన్ని దక్షుడి 26 మంది కూతుర్లు తండ్రికి ఫిర్యాదు చేస్తారు. ఈ విషయం మీద చంద్రుడిని మందలించినా అతనిలో మార్పు రాకపోవడంతో కోపోద్రిక్తుడైన దక్షుడు చంద్రుడికి శాపం ఇస్తాడు. దినదినం నీ వెలుగు తగ్గిపోవుతూ చివరికి అంతమవుతావంటూ శాపమిస్తాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని చంద్రుడు శాపవిమోచనం ప్రసాదించమని ప్రాధేయపడతాడు. అయినా దక్షుడు ససేమీరా అనడంతో ముల్లోకాల్లో ఉన్న దేవతల వద్దకు వెళతాడు చంద్రుడు.
దక్షుడు బ్రహ్మకుమారుడు కావడంతో తన కుమారుడి శాపానికి తిరుగు లేదంటూ బ్రహ్మ చంద్రుడిని పంపించేస్తాడు. విష్టు మూర్తి వద్దకు పరుగులు తీసిన చంద్రుడుకి అక్కడా భంగపాటే ఎదురవుతుంది. దీంతో చివరి ప్రయత్నంగా శివుడి వద్దకు వెళతాడు చంద్రుడు. అసలే భోళాశంకురుడు. తన భక్తులకు ఎలాంటి వరాలిచ్చేందుకైనా సిద్ధమయ్యే భగవంతుడు. ఇంకేముంది. చంద్రుడి మొర వినగానే కరిగిపోతాడు శివుడు.
అయితే దక్షుడి శాపంలో అర్థం ఉండడం.. ఒకరి మోజులోనే లోకాన్ని మరిచిపోవడం కారణంగా శాపం తప్పదని చెబుతాడు శివుడు. ఎలాగైనా తనని కాపాడాలంటూ కాళ్ల వేళ్లా పడుతాడు చంద్రుడు. దీంతో మధ్యే మార్గంగా ఓ ఉపాయం ఆలోచించిన శివుడు.. లోక కళ్యాణార్థం నీ వెలుగు తప్పని సరి కనుక.. పక్షం రోజులు క్షీణించి తిరిగి పక్షం రోజులు నీ వెలుగు.. నువ్వు పెరుగుతావని ఆశీర్వదిస్తాడు శివుడు. అందుకు భక్తిగా తనను తాను శివుడికి సమర్పించుకుంటాడు చంద్రుడు. మీ సిగలో చోటిస్తే లోక కళ్యాణం కోసం పాటుపడుతానంటూ చెబుతాడు. అందుకు సరేనన్న శివుడు చంద్రుడిని సిగలో ధరించి చంద్ర శేఖరుడిగా మారాడు.