Categories: అసిడిటీ

అసిడిటీని త‌గ్గించే ఇంటి చిట్కాలు..!

జీర్ణ‌స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే మ‌న‌కు వ‌స్తుంటాయి. కానీ కొంద‌రు వాటిని ప‌ట్టించుకోరు. నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. ఎందుకంటే జీర్ణ‌స‌మ‌స్య‌లు వ‌చ్చినా ఎక్కువ రోజులు ఉండ‌వు. కానీ వాటిని ప‌ట్టించుకోక‌పోతే అవి తీవ్ర‌త‌రం అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతో ప్రాణాల మీద‌కు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక జీర్ణ స‌మ‌స్య‌ల్లో అసిడిటీ చాలా మందికి వ‌స్తుంటుంది. జీర్ణాశ‌యంలో ఉత్ప‌త్తి అయ్యే ఆమ్లాలు ఆహార నాళాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తాయి. దీంతో అసిడిటీ వ‌స్తుంది. గుండెల్లో మంట‌గా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. ఛాతి, జీర్ణాశ‌యం, గొంతులోనూ మంటగా ఉంటుంది. త‌ర‌చూ అసిడిటీ స‌మ‌స్య వ‌స్తుంటే అది Gastroesophageal Reflux Disease (GERD) అనే తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌కు దారి తీసేందుకు అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల అసిడిటీ స‌మ‌స్య ఉందంటే దాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌రాదు.

best home remedies for acidity

అసిడిటీ స‌మ‌స్య ఉంటే జీర్ణాశ‌యంలో అసౌక‌ర్యంగా ఉంటుంది. ప‌ర‌గ‌డుపున ఉన్న‌ప్పుడు వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపించ‌డం, విరేచ‌నం స‌రిగ్గా అవ‌క‌పోవ‌డం లేదా నీళ్ల విరేచ‌నాలు అవ‌డం లేదా మ‌ల‌బ‌ద్ద‌కం సంభ‌వించ‌డం, ఆక‌లి లేక‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

అసిడిటీ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న‌శైలిని అనుస‌రించాలి. స‌మ‌యానికి భోజనం చేయాలి. కూర్చునే ఆహారం తినాలి. ఆహారాల‌ను స‌రిగ్గా న‌మిలి మింగాలి. తిన్న వెంట‌నే నిద్రించ‌రాదు. క‌నీసం 30 నిమిషాల పాటు అయినా కూర్చుని ఉండాలి. రోజులో ఎక్కువ సార్లు త‌క్కువ మొత్తంలో ఆహారం తినేలా ప్లాన్ చేసుకోవాలి. అధికంగా ఆహారాల‌ను తిన‌రాదు. త‌ర‌చూ వ్యాయామం చేయాలి. ఇక కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు, ఇంటి చిట్కాల‌తో అసిడిటీని త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో అసిడిటీ వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతోపాటు సుదీర్ఘ‌కాలం పాటు అసిడిటీ నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చు.

1. వాము

జీర్ణ స‌మ‌స్య‌లైన గ్యాస్, అసిడిటీ, అజీర్ణంల‌ను త‌గ్గించ‌డంలో వాము అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీంట్లో తైమోల్ అన‌బ‌డే బ‌యో కెమిక‌ల్ ఉంటుంది. ఇది జీర్ణ‌శ‌క్తిని పెంచుతుంది. ఒక టీస్పూన్ వాము గింజ‌ల‌ను తీసుకుని అందులో చిటికెడు ఉప్పు క‌లిపి బాగా న‌లిపి తినాలి. త‌రువాత ఒక గ్లాస్ నీటిని తాగాలి. దీంతో అసిడిటీ త‌గ్గుతుంది. అలాగే ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ వామును రాత్రంతా నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గడుపునే ఆ నీటిని తాగి ఆ గింజ‌ల‌ను తినాలి. రోజూ ఇలా చేస్తే అసిడిటీ బాధించ‌దు.

2. సోంపు

భోజ‌నం చేసిన త‌రువాత సోంపును తిన‌డం భార‌తీయ సంప్ర‌దాయంగా వ‌స్తోంది. దీని వ‌ల్ల నోటి దుర్వాస‌న కూడా త‌గ్గుతుంది. అయితే ఇలా సోంపును తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జీర్ణ శ‌క్తి పెరుగుతుంది. భోజ‌నం చేసిన వెంట‌నే 2 టీస్పూన్ల సోంపు గింజ‌లను రోజూ తినాలి. మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేశాక ఇలా తింటే అసిడిటీ త‌గ్గుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్ స‌మ‌స్య‌లు ఉండ‌వు.

3. పాలు, పెరుగు

పాలు, పెరుగు అసిడిటీని త‌గ్గించ‌డంలో బాగా ప‌నిచేస్తాయి. చ‌ల్ల‌ని పాలు లేదా పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల అసిడిటీ వెంట‌నే త‌గ్గుతుంది. భోజ‌నం చేసిన వెంట‌నే చ‌ల్ల‌ని పాలు లేదా పెరుగును తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. ఈ రెండింటిలోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఆమ్లాల‌ను త‌ట‌స్థం చేస్తుంది. దీంతోపాటు జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. గ్యాస్ స‌మ‌స్య త‌గ్గుతుంది.

4. తేనె

అసిడిటీని త‌గ్గించ‌డంలో తేనె కూడా అద్భుతంగా ప‌నిచేస్తుంది. రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ తేనె క‌లిపి తీసుకోవాలి. కొన్ని రోజుల పాటు ఇలా చేస్తే అసిడిటీ త‌గ్గుతుంది.

5. కొత్తిమీర

కొత్తిమీర లేదా ధ‌నియాల‌ను రోజూ తీసుకుంటున్నా అసిడిటీని త‌గ్గించుకోవ‌చ్చు. భోజనం చేసిన వెంట‌నే ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో 10 ఎంఎల్ కొత్తిమీర జ్యూస్ లేదా చిటికెడు ధ‌నియాల పొడిని క‌లిపి తాగితే అసిడిటీ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మ‌నం తీసుకునే ఆహారాల‌పై కూడా వీటిని చ‌ల్లి తీసుకోవ‌చ్చు. కొత్తిమీర ఆకుల‌ను నీటిలో మ‌రిగించి ఆ నీటిని తాగుతున్నా అసిడిటీ త‌గ్గుతుంది. అలాగే రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 2 టీస్పూన్ల కొత్తిమీర జ్యూస్‌ను తాగాలి. ఇది కూడా అసిడిటీని త‌గ్గిస్తుంది. దీంతోపాటు వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం త‌గ్గుతాయి.

6. పండ్లు

సిట్ర‌స్ జాతికి చెందిన పండ్లు యాసిడ్ స్వ‌భావాన్ని క‌లిగి ఉన్నా వాటిని తింటే మ‌న శ‌రీరంలోకి చేరే ఆ పండ్ల‌కు చెందిన ప‌దార్థాలు ఆల్క‌లైన్ స్వభావంలోకి మారుతాయి. అందువ‌ల్ల సిట్ర‌స్ జాతికి చెందిన పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అసిడిటీని త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే అర‌టి పండ్లు స‌హ‌జ‌సిద్ధ‌మైన అంటాసిడ్‌లా ప‌నిచేస్తాయి. అసిడిటీ ఉన్న‌ప్పుడు అర‌టిపండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతోపాటు ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా అసిడిటీని త‌గ్గించుకోవ‌చ్చు.

అయితే పైన తెలిపిన చిట్కాలతోపాటు ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న‌శైలిని పాటించాలి. వేళ‌కు భోజ‌నం చేయాలి. రాత్రి త్వ‌రగా నిద్రించి ఉద‌యం త్వ‌ర‌గా నిద్ర లేవాలి. వ్యాయామం చేయాలి. కారం, మ‌సాలాలు, జంక్ ఫుడ్స్‌, నూనె ప‌దార్థాల‌ను త‌గ్గించాలి. మ‌ద్యపానం, ధూమ‌పానం మానేయాలి. దీని వ‌ల్ల అసిడిటీ త‌గ్గుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts