చాలా మందికి అర్థరాత్రి పూట కాలి పిక్కలు పట్టేస్తుంటాయి. దీంతో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ సమస్యను Nocturnal Leg Cramps అంటారు. దీని వల్ల రాత్రి చాలా మందికి నిద్రకు భంగం కలుగుతుంది. కాలి పిక్కలు పట్టేసి తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే ఒక్కోసారి పాదాలు, తొడల్లోనూ ఇలా కండరాలు పట్టేస్తుంటాయి. దీంతో ఆయా భాగాల్లోనూ తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
కండరాలు పట్టేసినప్పుడు అవి ముడుచుకుపోయి ఉంటాయి. దీంతో పాదాలు కొన్ని సార్లు వంకర పోయినట్లు అవుతాయి. ఒక్కోసారి కాలి వేళ్లకు ఇలా జరుగుతుంది. దీంతో కాలి వేళ్లు వంకర పోయినట్లు అవుతాయి. అయితే ఈ సమస్య కొందరికి ఇంకా ఎక్కువగానే ఉంటుంది.
కండరాలు పట్టేసినప్పుడు సహజంగానే నొప్పి 5-10 నిమిషాల వరకు ఉంటుంది. తరువాత దానంతట అదే తగ్గిపోతుంది. అయితే కొందరికి ఈ సమస్య ఎప్పుడో ఒకసారి వస్తుంది. కానీ కొందరికి రోజూ రాత్రి వస్తుంది. కొందరికి పగలు కూడా ఇలా అవుతుంటుంది.
ఈ సమస్య సహజంగా వృద్ధుల్లో ఎక్కువగా వస్తుంది. 60 ఏళ్లు పైబడిన వారికి ఈ విధంగా సహజంగానే జరుగుతుంది. కానీ ఇతర వయస్సుల వారికి కూడా పలు కారణాల వల్ల ఈ సమస్య వస్తుంటుంది. ఫెరిఫెరల్ న్యూరోపతి, పార్కిన్సన్, లివర్ జబ్బులు, కిడ్నీ వ్యాధులు, రక్తనాళాలు పూడుకుపోవడం, వెరికోస్ వీన్స్ వంటి వ్యాధులు ఉన్నవారికి కండరాలు పట్టేస్తుంటాయి. అందువల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.
ఇక రోజూ కనీసం 30 నిమిషాలు అయినా సరే వాకింగ్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే పొటాషియం, మెగ్నిషియం ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. ఇవి లోపించినా కండరాలు అలా పట్టేస్తుంటాయి. కనుక పొటాషియం, మెగ్నిషియం ఎక్కువగా అందేలా చూసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
మనకు పొటాషియం ఎక్కువగా పెరుగు, అరటి పండ్లు, తర్బూజా, క్యారెట్లు, నారింజ పండ్లు, పాలు, చేపలు, పాలకూర, టమాటాలు, చిలగడ దుంపలు వంటి వాటిల్లో ఎక్కువగా లభిస్తుంది. అలాగే మెగ్నిషియం.. బాదంపప్పు, పచ్చికొబ్బరి, చేపలు, పాలకూర, అవకాడోలు, జీడిపప్పు, చింతపండు, అరటి పండ్లు.. వంటి వాటిల్లోలభిస్తుంది. వీటిని తింటే కండరాలు పట్టుకుపోకుండా చూసుకోవచ్చు.
ఇక కండరాలు పట్టేయకుండా ఉండాలంటే రోజూ రాత్రి నిద్రించే ముందు 2 టీస్పూన్ల అల్లం రసం తీసుకోవాలి. అలాగే అశ్వగంధ చూర్ణం ఒకటీస్పూన్ మోతాదులో ఒక గ్లాస్ పాలలో కలిపి తీసుకోవాలి. లేదా అశ్వగంధ ట్యాబ్లెట్లను తీసుకోవచ్చు. ఈ సమస్యకు ఉసిరికాయ జ్యూస్ కూడా పనిచేస్తుంది. రోజు రాత్రి భోజనానికి ముందు 30 ఎంఎల్ ఉసిరికాయ జ్యూస్‌ను తాగాలి. ఈ విధంగా చేస్తే కాలి పిక్కలు పట్టుకుపోవడం అనే సమస్య నుంచి బయట పడవచ్చు.