ఈ మధ్య హీరోలంతా సినిమా కథ ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలంతా ప్లాఫ్ అవుతున్నాయి. చిన్న చిన్న హీరోలు కూడా పెద్ద పెద్ద హిట్లను తమ ఖాతాలోకి వేసుకుంటున్నారు. ప్రేక్షకులు సినిమా పెద్దదా, చిన్నదా అని చూడటం లేదు, వాళ్ళకి నచ్చితే చాలు. ఇదే కాక కొందరు స్టార్ హీరోలు కొన్ని కొన్ని సినిమాలని వదిలేస్తుంటారు. అలా వదిలేసిన సినిమాలు హిట్ అవ్వొచ్చు లేదా ఫ్లాప్ అవ్వొచ్చు. హిట్ అయితే హీరో రాంగ్ స్టెప్ వేశాడని, ఫ్లాప్ అయితే ఆ సినిమాను ఒప్పుకోకుండా మంచి డిసిషన్ తీసుకున్నాడని మనమే అనుకుంటాం.
అయితే మహేష్ బాబు ఒక సినిమా నుండి తప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు వస్తున్నాయి. సుకుమార్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించాడు సూపర్ స్టార్. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా కార్యరూపం దాల్చకపోవడంతో మహేష్ సైడ్ అయిపోయాడట. అయితే ఈ సినిమా కాస్తా అల్లు అర్జున్ చేతికి వెళ్లి పోయింది. ఈ ఒక్క సినిమానే కాదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ అయిన చిత్రాలను మహేష్ వదులుకున్నాడు. అందులో సూపర్ స్టార్ తిరస్కరించిన కొన్ని హిట్ సినిమాల లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే..
మనసంతా నువ్వే చిత్రంలో మొదటగా మహేష్ కే ఆఫర్ వచ్చిందట. సినిమా నిర్మాత ఎం.ఎస్ రాజు ఈ సినిమా చెయ్యమని కోరాడట. అయితే అప్పటికే మహేష్ బాబు రాజకుమారుడు, యువరాజు, మురారి సినిమాలు హిట్ అయ్యి స్టార్ గా ఎదుగుతున్నాడు. దాంతో ఈ సినిమాని మహేష్ వదులుకున్నాడట. అయితే చిత్రం సినిమా విడుదల కావడం.. సినిమా సక్సెస్ అవడంతో ఉదయ్ కిరణ్ తెరపైకి వచ్చాడు. దీంతో ఈ సినిమా ఉదయ్ కిరణ్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. తరువాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏమాయ చేశావె సినిమా కోసం మహేశ్ బాబుని అనుకున్నాడట. అయితే కారణం తెలియదు కానీ మహేష్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ మూవీ నాగ చైతన్య చేతికి వెళ్ళింది. ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లొనే పెద్ద హిట్ అయ్యింది.
గోన గన్నా రెడ్డిగా అల్లు అర్జున్ క్యారెక్టర్ రుద్రమదేవి సినిమాలో ఫుల్ ఫేమస్ అయ్యింది. నిజానికి ఈ పాత్ర మహేష్ బాబు చేయాల్సింది. కానీ ఎందుకో అల్లు అర్జున్ కి వెళ్ళిపోయింది. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 24. సూర్య గెటప్స్ ఈ సినిమాలో ధి బెస్ట్. సూర్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇది. అయితే ఈ కథను ఫస్ట్ మహేష్ బాబుకే వినిపించాడట విక్రమ్. కానీ మహేష్ మాత్రం బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు సినిమాలకు కమిట్ అయ్యాడు. దీంతో డేట్స్ సర్దుబాటు కాలేదట. ఫలితంగా మరో హిట్ మూవీ మహేష్ ఖాతాలోకి రాలేదు.
తమిళ స్టార్ హీరో విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుని మహేష్ బాబుని సంప్రదించారట. మహేష్ అందుకు ఒప్పుకోలేదట. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150గా మన ముందుకు వచ్చింది కత్తి సినిమానే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఫిల్మ్ అ ఆ. ప్లాఫ్ లతో నితిన్ సతమతమవుతున్న టైంలో ఈ మూవీ అతనికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ఫస్ట్ మహేష్ బాబుకే అవకాశం వచ్చినా.. రిజక్ట్ చేయడంతో నితిన్ కు ఆ అవకాశం దక్కింది.
ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఫిదా’సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసింది. తెలంగాణ యాస ఈ సినిమాకి కొంత ప్లస్. ఇంకా సినిమా కథ కూడా బాగుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాని బంపర్ హిట్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తన సినిమాలతో కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడు. కానీ శేఖర్ కూడా ఈ సినిమాకి ఫస్ట్ మహేష్ నే అనుకున్నాడట. కానీ ప్రిన్స్ మాత్రం ఈ స్టోరీ తనకు సెట్ కాదని చెప్పేశాడంట. దీంతో వరుణ్ తేజ్ ఖాతాలో సూపర్ హిట్ పడింది. ఈ సినిమాతో సాయి పల్లవి రేంజ్ అమాంతం పెరిగింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలను మహేష్ బాబు రిజెక్ట్ చేయడంతో తన ఖాతాలో ఈ హిట్ సినిమాల్ని వేసుకోలేకపోయాడు.