Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీ పరిశ్రమలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో తెలుగు వెండితెరపై అడుగుపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దేశంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పడం కన్నా.. పవన్ కళ్యాణ్ భక్తులమని చెప్పడానికి ఎంతో ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ చిత్రం రిలీజ్ అయిందంటే చాలు ఆయన అభిమానులకు పెద్ద పండగే. బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ స్టామినాను అంచనా వేయడం కూడా కష్టమే. ఏ బొమ్మ పడిన బ్లాక్ బాస్టర్ హిట్ కావాల్సిందే.
అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే పవన్ కళ్యాణ్ మొదటి సినిమాలోకి ఎంట్రీ ఇవ్వటం ఎంతో నాటకీయంగా జరిగింది. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం పై సంభాషణ జరిగినా పవన్ ని హీరోగా పరిచయం చేయడానికి మూడేళ్లయినా సినిమా సెట్స్ పైకి వెళ్ల లేదట. ఈ కారణం గా పవన్ ఎంతో నిరాశకు గురయ్యారు. సినిమాలు తనకు సెట్ అయ్యేది కాదని బెంగళూరు వెళ్ళి నర్సరీ స్టార్ట్ చేస్తానని ఇంట్లో చెప్పేశారట పవన్ కళ్యాణ్.
నాకు తెలిసిన పని అదొక్కటే కచ్చితంగా మీరు ఒప్పుకోవాల్సిందే అని అందరినీ ఒప్పించారట. మానవుడు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్నట్లు.. అనూహ్యంగా అదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా పనులు మొదలైనట్లు సమాచారం అందిందట. దానితో బెంగళూరు వెళ్లాలనే పవన్ కళ్యాణ్ ఆలోచనకి పుల్ స్టాప్ పడింది. ఇప్పటికే నిరాశతో ఉన్న పవన్ కళ్యాణ్ చిత్రం మూడేళ్ల తర్వాత పట్టాలెక్కడంతో ఏదో మొక్కుబడిగా చేశారట. ఇదే తన చివరి సినిమా కావాలని కూడా భావించారట. తప్పించుకోవాలి అనుకున్న విధిని ఎవరూ మార్చలేరు. మెగాస్టార్ తమ్ముడు గా ఉండే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదిగి పవర్ స్టార్ గా ఎంతోమంది అభిమానుల మనసులు దోచుకున్నారు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేక పోయినా, తర్వాత గోకులంలో సీత ఆఫర్ వచ్చింది. అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ని సీరియస్ గా తీసుకోలేదట. ఈ చిత్రం కూడా పవన్ కళ్యాణ్ కి ఆశించిన మేరకు ఫలితాన్ని ఇవ్వకపోయినా మంచి గుర్తింపు సంపాదించింది. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ మనం ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి విజయాలు ముఖ్యం కాదు ప్రయాణమే ముఖ్యమని అర్థం చేసుకొని తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు.
సుస్వాగతం చిత్రంతో ఫస్ట్ హిట్ ను అందుకున్న పవన్ కళ్యాణ్ ఆ తరవాత వెనక్కి తిరిగి చూడలేదు. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి ఎన్నో చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు. పవర్ స్టార్ రేంజ్ నుంచి అభిమానులు మా దేవుడు అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు పవన్ కళ్యాణ్. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన స్టార్ డమ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.