Money Movie : తెలుగు సినిమా చరిత్రలో హాస్యం దట్టించి రామ్ గోపాల్ వర్మ శిష్యుడు శివ నాగేశ్వరరావు డైరెక్షన్ లో తీసిన మూవీ మనీ.. అప్పట్లో సూపర్ హిట్. ఎలాంటి స్టార్ హీరో లేకున్నా క్యారెక్టర్స్ ని నమ్ముకుని తీసిన ఈ సినిమా అదిరిపోయింది. ఖాన్ తో గేమ్స్ ఆడకు అంటూ బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్, అందరినీ ఈ చేత్తోనే పెద్ద పెద్ద స్టార్స్ ని చేశానంటూ తనికెళ్ళ భరణి బిల్డప్ ఇస్తూ చేసే నటన సూపర్బ్. జయసుధ, పరేష్ రావెల్, చిన్నా, కోట శ్రీనివాసరావు, జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలు వేశారు. తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం సరేసరి. డబ్బున్న ఓ భార్యను కిడ్నాప్ చేస్తే ఎలా రక్షించుకోవాలో ఆలోచించకుండా ఆస్తి ఎలా దోచేయాలా.. అన్న ఓ స్వార్ధపరుని కథే మనీ.
అసభ్యతకు ఎక్కడా తావివ్వకుండా పాత్రలతోనే రక్తికట్టించిన శివనాగేశ్వరరావు ప్రయోగానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కీరవాణి మ్యూజిక్, చక్రవర్తి కొడుకు శ్రీ ఇచ్చిన ట్యూన్స్ ఈ మూవీని ఓ రేంజ్ తీసుకెళ్లాయి. కోట శ్రీనివాసరావు చేత చేయించిన భద్రం కేర్ ఫుల్ బ్రదర్.. భర్తగా మారకు బాచిలర్ సాంగ్ ఇప్పటికీ చాలా మందికి హాట్ ఫేవరేట్ సాంగ్. ఖాన్ దాదా పాత్రలో బ్రహ్మానందం నటన పండించాడు.
క్షణ క్షణం మూవీ సమయంలో కో డైరెక్టర్ గా ఉన్న శివ నాగేశ్వరరావుని తన దగ్గరే ఉండిపొమ్మని, సినిమాకు రూ.5 లక్షలు ఇస్తానని వర్మ చెప్పాడు. అప్పటికి అతడి వేతనం రూ.75వేలు. అయితే డైరెక్షన్ చేయాలని ఉందని చెప్పడంతో అక్కినేని వెంకట్ తో మాట్లాడి చేయిస్తానని వర్మ చెప్పాడు. అయితే సడన్ గానే తానే వర్మ ప్రొడక్షన్స్ పెట్టి శివ నాగేశ్వరరావు డైరెక్షన్ లో సినిమాకు రెడీ అయ్యాడు. రూత్ లెస్ పీపుల్ మూవీ చూసి మన నేటివిటీకి తగ్గట్టు ఆకలి, నిరుద్యోగం, డబ్బు అవసరం.. అన్నీ జోడించి శివ నాగేశ్వరరావు కథ రాశారు. ఉత్తేజ్ కూడా ఓ వెర్షన్ రాశారు. అయితే టైటిల్ కోసం ఆలోచిస్తుంటే.. వెంకట్ అక్కినేని అమెరికాలో తాను చూసిన అదర్ పీపుల్స్ మనీ.. మూవీ గురించి గొప్పగా చెప్పడంతో ఈ సినిమాకు మనీ అనే టైటిల్ పెట్టారు.
ఇక రేవతి హీరోయిన్ గా రాత్రి మూవీని వర్మ సొంత డైరెక్షన్ లో స్టార్ట్ చేయగా.. శివ నాగేశ్వరరావు డైరెక్షన్ లో మనీ స్టార్ట్ అయింది. ఈ రెండు సినిమాల నిర్మాణం వర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే. మనీలో జయప్రదను అనుకుంటే తన అభిమాన హీరోయిన్ జయసుధను ఒకే చేయించాడు వర్మ. ఇక ఆమె భర్త ప్లేస్ లో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అనుకుని.. వర్మ అడగడం ఆయన ఒకే చెప్పడం అయింది. అయితే శివ నాగేశ్వరరావు మదిలో దాసరి పేరు ఉంది. మొత్తానికి పరేష్ రావెల్ ఒకే అయ్యాడు.
హీరోయిన్ గా రేణుకా సహానీ కన్ఫర్మ్, హీరోగా చిన్నా. ఫొటోగ్రఫీకి తేజను సెలెక్ట్ చేశారు. తేజ ఆ సమయంలోనే పెళ్లి చేసుకున్నాడు. శ్యాం కె నాయుడు, సమీర్ రెడ్డి తేజకు అసిస్టెంట్స్ గా ఉన్నారు. 1990 ఆగస్టులో తెలుగు, హిందీ వెర్షన్స్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. 40 శాతం పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందులతో హిందీ వెర్షన్ పక్కన పెట్టేశారు. ఈలోగా రాత్రి మూవీలో కీరవాణితో తేడా రావడంతో మనీ సినిమాకు కూడా ఆయన డ్రాప్ అయ్యారు. మణిశర్మ చేత చేయించాలనుకుంటే.. చివరకు శ్రీ ఎంటరయ్యాడు.
ఇక తేజ బిజీ కావడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోవడంతో శ్యాం కె నాయుడు తీశాడు. దెబ్బలు తగిలి మూడు నెలలు, హిందీ సినిమాలు పూర్తిచేసి రావడంతో మరో మూడు నెలలు మొత్తం 6 నెలల గ్యాప్ తర్వాత పరేష్ రావెల్ రావడంతో సినిమా పూర్తయింది. సినిమా పూర్తయ్యేసరికి 9వేల అడుగుల నిడివి వచ్చింది. సెన్సార్ నిబంధనల ప్రకారం అప్పటికప్పుడు రెండున్నరవేల అడుగుల నిడివితో బ్రహ్మానందంతో ఖాన్ దాదా ఎపిసోడ్ చేయించారు.
సినిమా పూర్తయినా సరే.. మనీ సరిపోక మనీ రిలీజ్ ఆగింది. ఈలోగా అంతం, గాయం మూవీలకు వర్మ దగ్గర శివనాగేశ్వరరావు పనిచేసి వచ్చాడు. మొత్తానికి 1993 జులై 11న మూవీ రిలీజ్ అయింది. మొదట్లో సోలో గా సాగినా తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. 8 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. మొదటి రన్ లో రూ.3 కోట్ల బిజినెస్ చేసింది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు కూడా గెలిచింది. శివనాగేశ్వరరావు, బ్రహ్మానందంలకు నంది అవార్డులు వచ్చాయి. ఉగాది రోజు బ్రహ్మికి మారుతి సుజికి కారుని వర్మ గిఫ్ట్ గా ఇచ్చాడు. గాయం 150 రోజుల ఫంక్షన్ తోపాటు మనీ 100 డేస్ వేడుక నిర్వహించారు. శ్రీదేవి చీఫ్ గెస్ట్. సీక్వెల్ కి కూడా ఈ మూవీ శ్రీకారం చుట్టింది. అలా మనీ మూవీ అప్పట్లో ఎన్నో సంచలనాలను సృష్టించింది.