వినోదం

Chiranjeevi Cake : కేక్‌లో విషం పెట్టి చిరంజీవిని చంపాల‌ని చూశారా ? అస‌లు ఆ రోజు ఏం జ‌రిగింది ?

Chiranjeevi Cake : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సి న ప‌నిలేదు. ఈయ‌న న‌టించిన ఎన్నో చిత్రాలు విజ‌య‌వంతం అయ్యాయి. బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలిచాయి. ఓ ద‌శ‌లో సుప్రీమ్ హీరోగా ఉన్న చిరు మెగాస్టార్ అయ్యారు. అంతులేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే చాలు.. ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు.. ఇత‌ర సినీ ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఆయ‌న‌తో సినిమా చేస్తే మినిమ‌మ్ గ్యారంటీ అన్న భావ‌న ద‌ర్శ‌క నిర్మాత‌ల్లో ఉంటుంది. ఇక ఆయ‌న‌తో క‌ల‌సి న‌టించాల‌ని ఇత‌ర హీరోలు, హీరోయిన్స్ కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఆయ‌న సినిమాలో చిన్న అవ‌కాశం కోసం తెగ ప్ర‌య‌త్నిస్తుంటారు.

అయితే చిరంజీవికి ఈ స‌క్సెస్ ఊరికే రాలేదు. అందుకోసం ఆయ‌న ఎంతో శ్ర‌మించారు. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణం రాజు వంటి హీరోల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండేది. న‌ట‌న‌లో వారితో ఎవ‌రూ పోటీ ప‌డ‌లేక‌పోయారు. అయితే వారి పక్క‌న స్టార్‌గా నిల‌బ‌డాలంటే అందుకు డ్యాన్స్ ఒక్క‌టే మార్గ‌మ‌ని చిరంజీవి భావించారు. అందుక‌నే ఆయ‌న డ్యాన్స్‌ను తెగ ప్రాక్టీస్ చేసేవారు. త‌న సినిమాల్లోని పాట‌ల్లో డ్యాన్స్ ప్ర‌ధాన అంశంగా ఉండేలా చూసుకునేవారు. మైకేల్ జాక్స‌న్‌కు చెందిన పాట‌ల వీడియోల‌ను చూసి ఆయ‌న డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేసేవారు.

poison attempt on chiranjeevi what happened then

అయితే ఒక ద‌శ‌లో ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో వెళ్లాక‌.. ఆయ‌న‌తో పోటీ ప‌డే ఇత‌ర హీరోలు కూడా వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల సినిమాల సంఖ్యను త‌గ్గించేశారు. దీంతో ఆ ఖాళీని పూర్తి చేసేందుకు చిరంజీవికి చ‌క్క‌ని అవ‌కాశం ల‌భించింది. ఆయ‌న దాన్ని స‌ద్వినియోగం చేసుకున్నారు. వ‌రుస‌గా సినిమాలు తీశారు. దీంతో అన్నీ వ‌రుస‌గా హిట్ అయ్యాయి. అప్ప‌ట్లో ఆయ‌న తీసిన ఖైదీ త‌రువాత ఆయ‌న‌కు పాపులారిటీ బాగా పెరిగింది. దీంతో అడ‌వి దొంగ‌, కిరాత‌కుడు, కొండ‌వీటి రాజా, చంట‌బ్బాయి, రాక్ష‌సుడు వంటి చిత్రాల‌ను తీసి హిట్ కొట్టారు.

ఇక అవే సినిమాల ఊపులో చిరంజీవి 1988లో మ‌ర‌ణ మృదంగం సినిమా షూటింగ్ చేస్తున్నారు. అప్ప‌ట్లో హైద‌రాబాద్‌లో సినిమా షూటింగ్‌ల‌కు స్టూడియోలు స‌రిగ్గా ఉండేవి కావు. దీంతో అప్ప‌టికీ ఇంకా మ‌ద్రాస్ (చెన్నై)లోనే సినిమా షూటింగ్స్ చేసేవారు. అలా మ‌ద్రాస్ రేస్ కోర్టులో ఒక రోజు మ‌ర‌ణ మృదంగం షూటింగ్ జ‌రుగుతోంది. అయితే చిరంజీవిని ఒక్క‌సారి అయినా క‌లుద్దామ‌ని చెప్పి అక్క‌డికి చాలా మంది ఫ్యాన్స్ వ‌చ్చారు. గేటు బ‌య‌టే వేచి చూడ‌సాగారు. బ‌య‌ట ఫ్యాన్స్ ఉన్నార‌ని చెబితే.. ఒక్క‌సారి ప‌ల‌క‌రిద్దామ‌ని చిరంజీవి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఫ్యాన్స్ ను చూసి ఆప్యాయంగా చేయి ఊపారు.

ఇక అంతలోనే ఒక ఫ్యాన్ దూసుకుని వ‌చ్చి ఆ రోజు త‌న పుట్టిన రోజు అని.. కేక్ క‌ట్ చేసి విషెస్ చెప్పాల‌ని కోరాడు. అందుకు చిరంజీవి స‌రే అని కేక్ క‌ట్ చేశారు. అయితే ఆ కేక్‌ను తినాలని అత‌ను బ‌ల‌వంత పెట్టాడు. తాను షూటింగ్ మ‌ధ్య‌లో ఉన్నాన‌ని.. ఆహారం తీసుకోకూడ‌ద‌ని.. చిరంజీవి చెబుతున్నా అత‌ను విన‌లేదు. చిరు నోట్లో కేక్‌ను బ‌ల‌వంతంగా పెట్టేశాడు. అయితే దాన్ని వెంట‌నే ఆయ‌న ఊంచేశారు. ఆ ఫ్యాన్ చేసిన ప‌నికి షాక్ తిన్న చిరంజీవి అక్క‌డి నుంచి వేగంగా వెళ్లిపోయి సెట్‌కు చేరుకున్నారు. అయితే కేక్‌ను తిన్నాక ఆయ‌న పెద‌వులు నీలి రంగులోకి మారాయి. దీంతో అది గ‌మ‌నించిన చిత్ర యూనిట్ సిబ్బంది ఆ విష‌యం ఆయ‌న‌కు చెప్పారు. ఇక ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా చిరంజీవి వెంట‌నే హాస్పిట‌ల్‌కు వెళ్లారు.

అక్క‌డ వైద్యులు ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు చేసి విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని నిర్దారించారు. వెంట‌నే వాంతులు చేయించి లోప‌ల ఉన్న‌దంతా కక్కించారు. త‌రువాత చికిత్స చేశారు. రాత్రి హాస్పిట‌ల్‌లో చేరితే ఆయ‌న‌ను ఉద‌యం డిశ్చార్జి చేసి భ‌యం లేద‌ని చెప్పారు. దీంతో ఈ వార్త అప్ప‌ట్లో పెను సంచ‌ల‌న‌మే సృష్టించింది. చిరంజీవిపై విష ప్ర‌యోగం జ‌రిగింద‌న్న వార్త క‌ల‌క‌లం రేపింది. అయితే ఈ సంఘ‌ట‌న మ‌ద్రాస్‌లో జ‌రిగింది క‌నుక తెలుగు మీడియా పెద్ద‌గా క‌వ‌ర్ చేయ‌లేదు. కానీ కొన్ని ప‌త్రిక‌లు ఈ వార్తను ప్ర‌చురించాయి. ఇక అప్ప‌టి వార్తా ప‌త్రిక‌ల‌కు చెందిన క్లిప్పింగ్స్ కూడా ఇప్ప‌టికీ అందుబాటులో ఉన్నాయి.

అలా చిరంజీవిపై అప్ప‌ట్లో జ‌రిగిన విష ప్ర‌యోగం పెను దుమారాన్నే సృష్టించింది. అయితే విష ప్ర‌యోగం ఎవ‌రు చేశారు.. అన్న కార‌ణాలు తెలియ‌దు కానీ.. ఆయ‌న ఎదుగుద‌ల‌ను చూసి ఓర్వ‌లేక ఎవ‌రో ఇలా చేయించార‌నే విష‌యం మాత్రం స్ప‌ష్ట‌మైంది. ఆయ‌న‌ను కేక్ పెట్టి చంపాల‌ని కొంద‌రు య‌త్నించిన‌ట్లు మాత్రం రుజువైంది. దీంతో అప్ప‌టి నుంచి చిరంజీవి బ‌య‌ట ఫుడ్‌ను తిన‌డం మానేశారు. ఇంటి వ‌ద్ద నుంచే ఆయ‌న‌కు భోజ‌నం వ‌స్తుంది. అయితే ఒక వేళ అప్పుడు జ‌ర‌గ‌రానిది జ‌రిగి ఉంటే.. చిరంజీవి అనే వ్య‌క్తి అప్పుడే చ‌నిపోయే ఉండేవారు. కేవ‌లం ఆయ‌న జ్ఞాప‌కాలు మాత్ర‌మే ఇప్ప‌టికీ మిగిలి ఉండేవి. ఆయ‌న‌కు ల‌క్ ఉంది కాబ‌ట్టే ప్రాణాపాయం నుంచి బ‌య‌ట ప‌డ్డార‌ని చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts