పాన్ ఇండియా స్టార్‌గా మారినా కూడా ప్రభాస్ ప్రయోగాలు ఆపలేదు. ఎప్పుడూ ఒకే విధమైన సినిమాలు చేస్తుంటే తన ఫ్యాన్స్‌కు కూడా బోర్ కొట్టేస్తుందని.. అందుకే తను చేసే సినిమాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్ అని ఇదివరకే చెప్పుకొచ్చాడు ప్రభాస్. అయితే ప్రభాస్ సలార్, కల్కి హిట్ అవ్వడంతో రాబోయే సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ మారుతితో చేస్తున్న సినిమా విషయంలో అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. దానికి కారణం మారుతికి వరుస ఫ్లాప్ లు ఉండడం, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని మారుతి హ్యాండిల్ చేయలేడని టాక్ వినిపిస్తోంది.
అయితే ఇప్పటికే వరుస షూటింగ్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్.. మారుతితో చేస్తున్న చిత్రాన్ని కూడా వేగంగా షూటింగ్ చేస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మారుతి. ప్రభాస్, మారుతికాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే రాజాసాబ్ అనే టైటిల్ ఖారరయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇది ఒక తాత, మనవడి కథ అని, రాజాసాబ్ అంటే తాత స్థాపించిన థియేటర్ పేరు అని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఆ థియేటర్ కోసం ఎలా పోరాడాడు ? ఆ థియేటర్ ని ఎవరు తీసుకున్నారు ? అనే విషయం చుట్టూ కథ నడుస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఫిల్మ్ సిటీలో రాజా సాబ్ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇందులో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని కొందరు అంటున్నారు. ఈ మూవీలో రాశీ ఖన్నా, మాళవికా మోహనన్, శ్రీలీల హీరోయిన్లుగా ఫిక్స్ అయ్యారు. ఇక మారుతి చివరిగా తెరకెక్కించిన ప్రతిరోజు పండగే చిత్రం కూడా తాత, మనవడి కథాంశంతో తెరకెక్కిన విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ కలసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతోపాటు, తమిళ్, కన్నడ, మళయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.