food

Karivepaku Karam : క‌రివేపాకు కారం త‌యారీ ఇలా.. అన్నంలో మొద‌టి ముద్ద‌లో తినాలి..

Karivepaku Karam : మ‌న ఇంటి పెర‌ట్లో త‌ప్ప‌కుండా ఉండాల్సిన చెట్ల‌ల్లో క‌రివేపాకు చెట్టు కూడా ఒక‌టి. క‌రివేపాకును మ‌నం త‌ర‌చూ వంట‌ల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం. క‌రివేపాకును ఉప‌యోగించ‌డం వల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కానీ కూర‌ల్లో వేసే క‌రివేపాకును చాలా మంది తీసి ప‌క్క‌న‌ పెడుతూ ఉంటారు. దీని వ‌ల్ల క‌రివేపాకులో ఉండే ఔషధ‌ గుణాలు మ‌న శ‌రీరానికి అంత‌గా అంద‌వు. క‌నుక ఈ క‌రివేపాకుతో మ‌నం కారాన్ని చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితోపాటు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. క‌రివేపాకుతో కారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌రివేపాకు కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క‌రివేపాకు – 2 క‌ప్పులు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, మిన‌ప ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్ కంటే త‌క్కువ‌, ఎండు మిర‌ప‌కాయ‌లు – 10 లేదా త‌గిన‌న్ని, ప‌సుపు – పావు టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, చింత‌పండు – 15 గ్రాములు, ఉప్పు – త‌గినంత‌.

how to make karivepaku karam at home easy steps

క‌రివేపాకు కారం త‌యారీ విధానం..

ముందుగా క‌రివేపాకును శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత శ‌న‌గ ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, మెంతులు వేసి వేయించాలి. త‌రువాత ఎండు మిర‌ప‌కాయ‌ల‌ను వేసి అవి రంగు మారే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఇంగువ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ముందుగా ఆర‌బెట్టుకున్న క‌రివేపాకును వేసి 3 నుండి 5 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇవి అన్నీ కూడా చ‌ల్ల‌గా అయిన త‌రువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పును కూడా వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌ల‌ను కూడా వేసి అవి క‌చ్చా ప‌చ్చాగా అయ్యేలా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌రివేపాకు కారం త‌యారవుతుంది. ఈ కారాన్ని గాలి త‌గ‌ల‌కుండా గాజు సీసాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల నెల‌రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన క‌రివేపాకు కారాన్ని అన్నంతోపాటు దోశ‌, ఇడ్లీ, ఉప్మా వంటి అల్పాహారాల‌తో కూడా తిన‌వ‌చ్చు. అన్నంలో మొద‌టి ముద్ద‌ను క‌రివేపాకు కారంతో తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది.

Admin

Recent Posts