Ragi Laddu : మనం చిరు ధాన్యాలయినటు వంటి రాగులను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. రాగులు మనకు విరివిరిగా లభిస్తాయి. ప్రస్తుత కాలంలో వస్తున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది రాగులను ఆహారంగా తీసుకుంటున్నారు. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బీపీ, షుగర్ వంటి వ్యాధులను నియంత్రించడంలో రాగులు ఎంతో సహాయపడతాయి. రాగులను పిండిగా చేసి మనం జావ, ఉప్మా, ఇడ్లీ, రోటీ వంటి వాటిని తయారు చేసుకుంటూ ఉంటాం. ఇవే కాకుండా రాగులతో ఎంతో రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా రాగి లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – 250 గ్రా., పల్లీలు – 50 గ్రా., బెల్లం – 250 గ్రా., యాలకుల పొడి – చిటికెడు, నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 100 ఎంఎల్.
రాగి లడ్డూల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక రాగిపిండిని వేసి కొద్దిగా రంగు మారే వరకు చిన్న మంటపై వేయించుకోవాలి. తరువాత పల్లీలను కూడా వేసి వేయించి పొట్టు తీయాలి. ఈ పల్లీలను ఒక జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో లేదా కళాయిలో బెల్లాన్ని , నీళ్లను పోసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగి తరువాత వడపోసి మరలా తీగపాకం వచ్చే వరకు వేడి చేయాలి.
బెల్లం పాకం వచ్చిన తరువాత యాలకుల పొడిని వేసి కలపాలి. తరువాత కచ్చా పచ్చాగా మిక్సీ పట్టిన పల్లీలను, రాగి పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం చల్లగా అయ్యి గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యిని రాసుకుంటూ తగిన పరిమాణంలో పిండిని తీసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి లడ్డూలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల 10 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ రాగి లడ్డూలను రోజుకి ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల రాగుల్లో ఉండే పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.