Carrot Juice : మనకు అందుబాటులో ఉన్న దుంప కూరల్లో క్యారెట్ ఒకటి. ఇది మిగిలిన దుంప కూరలకు చాలా భిన్నమైంది. ఇది ఎంతో తియ్యగా ఉంటుంది. కనుక దీన్ని పచ్చిగా కూడా తింటుంటారు. అయితే క్యారెట్ వల్ల వాస్తవానికి మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరచడంతోపాటు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో మనకు ఎక్కువగా దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. కనుక ఇవి రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. దీన్ని మనకు క్యారెట్లు అందిస్తాయి. అయితే క్యారెట్లను రోజూ తినలేమని అనుకునేవారు.. కనీసం రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను అయినా సరే తాగాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక క్యారెట్ జ్యూస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యారెట్ ముక్కలు – రెండు కప్పులు, పంచదార – అర కప్పు, నీళ్లు – 4 కప్పులు, నిమ్మ రసం – 3 టీ స్పూన్స్, అల్లం ముక్క – ఒక ఇంచు ముక్క, ఉప్పు – చిటికెడు, ఐస్ క్యూబ్స్ – 3 లేదా 4.
క్యారెట్ జ్యూస్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో లేదా బ్లెండర్ లో క్యారెట్ ముక్కలను, పావు కప్పు పంచదారను వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత 2 కప్పుల నీళ్లును పోసి 3 నిమిషాల పాటు మరలా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వస్త్రంలో లేదా జల్లిగంటె సహాయంతో వడకట్టుకోవాలి. వడకట్టగా వచ్చిన క్యారెట్ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులోనిమ్మ రసాన్ని, తగినన్ని ఐస్ క్యూబ్స్ వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యారెట్ జ్యూస్ తయారవుతుంది. అయితే చల్లదనం వద్దనుకుంటే ఐస్ క్యూబ్స్‌కు బదులుగా నీళ్లను కలిపి తాగవచ్చు. లేదా మరీ చల్లగా అవసరం లేదనుకుంటే కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి కూడా తాగవచ్చు. ఈ జ్యూస్‌ను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తో తీసుకుంటే అధికంగా ప్రయోజనాలు కలుగుతాయి.