పూణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకాలకు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతి ఇచ్చింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ గత కొద్ది రోజుల క్రితం దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే సదరు సంస్థ అందించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణుల కమిటీ శుక్రవారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేసింది.
కాగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించాక దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు పంపిణీ చేస్తారు. వ్యాక్సిన్ కు గాను నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ 90 శాతం మేర ప్రభావవంతంగా పనిచేసిందని ఆస్ట్రా జెనెకా సంస్థ వెల్లడించింది. కాగా ఈ వ్యాక్సిన్‌ను 55 ఏళ్లకు పైబడిన వారికి కూడా రెండు డోసుల చొప్పున ఇచ్చి ట్రయల్స్ ను నిర్వహించారు.
ఇక ఇప్పటికే దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి గాను తొలి దశలో పలు రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించారు. శనివారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో మారు డ్రై రన్ నిర్వహిస్తారు. కాగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు సంయుక్తంగా కలిసి రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఇప్పటికే బ్రిటన్‌లో అనుమతి లభించగా ప్రస్తుతం భారత్‌లోనూ ఈ వ్యాక్సిన్‌కు అనుమతి లభించడం విశేషం. సీరమ్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ కు గాను 4 కోట్ల డోసులను ఇప్పటికే సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. కాగా తొలి దశలో మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు.