దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు తాజాగా 1.1 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. గత 15 ఏళ్లుగా ఇది ఢిల్లీలో రెండో అత్యల్ప ఉష్ణోగ్రత కావడం విశేషం. 2006లో ఢిల్లీలో 0.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం వల్ల ఢిల్లీలో ప్రస్తుతం గుండె జబ్బుల బాధితులు పెరిగారు. గత ఏడాది కన్నా ఈ సారి ఢిల్లీలో చలికాలంలో హార్ట్ ఎటాక్ కేసులు 50 శాతం పెరిగాయని వైద్యులు తెలిపారు.
గురుగ్రామ్‌లో ఉన్న మేదాంత హాస్పిటల్‌లో గతేడాది డిసెంబర్ కన్నా ఈ సారి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు హార్ట్ ఎటాక్ కేసులు 50 శాతం పెరిగాయి. ఈ మేరకు హాస్పిటల్ వైద్యులు వివరాలను వెల్లడించారు. అలాగే ఢిల్లీలోని ఆకాష్ హెల్త్ కేర్ అనే మరో హాస్పిటల్‌లో గతేడాది నవంబర్ నుంచి 300 మంది పేషెంట్లు గుండె సమస్యలతో హాస్పిటల్‌లో చేరగా ఈ సారి వారి సంఖ్య 500 కు చేరింది. ఢిల్లీలో అత్యల్పంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు.
కాగా అతి శీతల ఉష్ణోగ్రతలు ఉంటే రక్తనాళాలు ఒత్తిడికి గురై కుచించుకుపోయినట్లు మారుతాయి. దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె, శరీరంకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్‌లు సంభవిస్తాయి. అలాగే ఎక్కువ సేపు చలిలో ఉండడం వల్ల శరీరం హైపో థెర్మియా అనే స్థితికి చేరుకుంటుంది. దీంతో శరీరం ఉత్పత్తి చేసే వేడి కన్నా అప్పటికే ఉన్న వేడి త్వరగా పోతుంది. ఈ క్రమంలో గుండె కండరాలు దెబ్బతింటాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు వస్తాయి.
ఇక కోవిడ్ నుంచి రికవరీ అయిన వారిలోనూ గుండె సమస్యలు వస్తున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. అందువల్ల వీరికి కూడా ప్రస్తుతం చలి వల్ల హార్ట్ ఎటాక్‌లు వస్తున్నట్లు నిర్దారించారు. ఈ క్రమంలో ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారితోపాటు, కోవిడ్ నుంచి కోలుకున్న వారు హార్ట్ ఎటాక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు చలి నుంచి కచ్చితంగా రక్షణ కల్పించుకోవాలని, శరీరం ఎల్లప్పుడూ వేడిగా ఉండేలా చూసుకుంటే చలికాలంలో హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.