కరోనా వైరస్‌ను చంపేసే పాము విషం.. కనుగొన్న సైంటిస్టులు..

కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారి అంత సులభంగా పోదని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ ఎప్పటికప్పుడు బలపడి కొత్త కొత్త రూపాల్లో ప్రజలకు వ్యాప్తి చెందుతోంది. అందువల్ల దీన్ని రాకుండా ఉండేందుకు టీకాలను వేసుకోవడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు.

కరోనా వైరస్‌ను చంపేసే పాము విషం.. కనుగొన్న సైంటిస్టులు..

అయితే కరోనా వైరస్‌ను ఓ జాతికి చెందిన పాము విషం చంపేయగలదని సైంటిస్టులు గుర్తించారు. బ్రెజిల్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఈ విషయంపై పరిశోధనలు చేశారు. ఆ వివరాలను మాలిక్యూల్స్‌ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.

బ్రెజిల్‌కు చెందిన జరారాకుస్సు అనే జాతికి చెందిన పాము విషం కరోనా వైరస్‌ను నాశనం చేస్తుందని సైంటిస్టులు చేసిన ప్రయోగాల్లో వెల్లడైంది. ఆ వైరస్‌ వృద్ధి చెందకుండా సదరు విషం 75 శాతం వరకు ప్రభావం చూపిస్తుందని గుర్తించారు.

కాగా ఈ ప్రయోగాన్ని సైంటిస్టులు ప్రస్తుతం కోతులకు చెందిన కణజాలంపైనే చేశారు. త్వరలో మనిష కణజాలంపై చేయనున్నారు. దీంతో అసలు విషయం తెలియనుంది. అయినప్పటికీ కోవిడ్‌ను అంతం చేయాలని జరుగుతున్న ప్రయత్నాల్లో మొదటి స్టెప్‌ వేసినట్లయిందని పైన తెలిపిన పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్‌ రఫాయిల్‌ గైడో తెలిపారు. ఈ క్రమంలోనే త్వరలో తాము మనుషుల కణజాలంపై జరపనున్న ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

యూనివర్సిటీ ఆఫ్‌ సావో పాలోకు చెందిన ప్రొఫెసర్‌ రఫాయిల్‌ తన బృందంతో కలిసి పై పరిశోధనలను చేపట్టారు. కాగా బ్రెజిల్‌లో పెరిగే జరారాకుస్సు జాతి పాములు 6 అడుగుల వరకు అంటే.. సుమారుగా 2 మీటర్ల మేర పెరుగుతాయి. ఇవి అట్లాంటిక్‌ తీర ప్రాంతంలో ఉండే అడవుల్లోనూ, బొలివియా, పరాగ్వే, అర్జెంటీనాల్లోనూ పెరుగుతాయి. ఇవి బ్రెజిల్‌లో ఉన్న అత్యంత పెద్ద పాముల్లో ఒక జాతి కావడం విశేషం.

Admin

Recent Posts