Carom Seeds Tea : భారతీయులు ఎంతో పురాతన కాలం నుండి వంటల్లో వామును ఉపయోగిస్తున్నారు. వాము కారం రుచితోపాటు చక్కని వాసనను కూడా కలిగి ఉంటుంది. వంటల్లో వాడడం వల్ల వాము రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. వాములో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వాము సర్వరోగ నివారిణిగా కూడా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాములో విటమిన్ ఎ, సి, ఇ, కె లతోపాటు క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. వామును ఉపయోగించడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యల నుండి తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
వామును ఏవిధంగా తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు.. అసలు వామువల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వామును ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి కొద్దిగా ఉప్పును కలిపి తీసుకకోవడం వల్ల చక్కని ఫలితాలను పొందవచ్చు. వాము ఘూటు రుచిని కలిగి ఉంటుంది. కనుక దీనిని అందరూ తినలేరు. అలాంటి వారు వాముతో టీ ని చేసుకుని తాగడం వల్ల కూడా ప్రయోజనాలను పొందవచ్చు. వాము టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో ఒక టీ స్పూన్ వామును వేసి నీటిని బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి అందులో ఒక టీ స్పూన్ తేనెను కలపాలి. ఈ విధంగా తయారు చేసుకున్న టీ ని రోజూ ఉదయం పగడుపున గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వాముతో ఈ విధంగా టీ ని చేసుకుని తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
వాములో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. కనుక ఈ టీ ని తాగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గు ముఖం పడతాయి. నెలసరి సక్రమంగా లేని స్త్రీలు అలాగే నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే వారు వాము టీ ని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. వాము టీ ని తాగడం వల్ల లేదా వామును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాం. వాము టీ ని తాగడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా వాముకు ఉంటుంది. తరచూ వాము టీ ని తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం. జీర్ణసంబంధిత సమస్యలైన గ్యాస్, అజీర్తి, మలబద్దకం వంటి వాటితో బాధపడే వారు వాము టీ ని తాగడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. పరగడుపున వాము ను తినడం వల్ల లేదా వాము టీ ని తాగడం వల్ల ఇటువంటి మరెన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.