Calcium Rich Tea : నేటి తరుణంలో మనలో చాలా మంది ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఎముకలు గుల్లబారడం, ఎముకలు ధృడంగా లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. క్యాల్షియం లోపం, విటమిన్ డి లోపం, మినరల్స్ కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం వంటి వివిధ కారణాల చేత ఎముకలు ధృడత్వాన్ని కోల్పోతున్నాయి. ముఖ్యంగా ఆమ్లత్వం ఎక్కువగా ఉండే ఆహారాలను, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారిపోతున్నాయి. పూర్వకాలంలో వయసుపైబడిన వారిలో మాత్రమే ఎముకలు ధృడంగాఉండకపోయేవి. కానీ నేటి తరుణంలో చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోతున్నాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, ఆస్ట్రియో పోరోసిస్ వంటి సమస్యల బారిన పడుతున్నారు.
ఇటువంటి సమస్యలు మన దరి చేరకుండా ఉండాలన్నా అలాగే ఎముకలు ధృడంగా మారాలన్నా పౌష్టికాహారంతో పాటు ఒక టీని కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ టీని తాగడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. క్రిసాంతిమమ్ అనే పూలతో తయారు చేసిన టీని తాగడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయని వారు చెబుతున్నారు. ఈ పూలు మనకు ఎండిన రూపంలో ఆన్ లైన్ లో లభిస్తూ ఉంటాయి. ఈ పూలను 5 నుండి 6 చొప్పున 200 ఎమ్ ఎల్ నీటిలో వేసి మరిగించాలి. తరువాత వీటిని వడకట్టి ఇందులో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి.
ఈ పూలతో తయారు చేసిన టీ లో ప్రత్యేకంగా ఉండే క్యుబాంబరిన్ ఎ అనే రసాయన సమ్మేళనమే ఎముకలు గుల్లబారకుండా కాపాడడంలో సహాయపడుతుందని వారు తెలియజేసారు. చైనా దేశ శాస్త్రవేత్తలు జరిపిన ఈ పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అలాగే గర్భాశయం తొలగించిన స్త్రీల్లలో, మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీల్లలో ఎముకలు ఎక్కువగా గుల్లబారిపోతూ ఉంటాయి. అలాంటి వారు ఈ టీని తాగడం వల్ల వారికి తగినంత క్యాల్షియం లభించి ఎముకలు మరలా ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది. అలాగే ఈ టీని తాగడం వల్ల ఒత్తిడి, ఆత్రుత, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు, వయసు పైబడిన వారు క్రిసాంతిమమ్ పూలతో టీని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు.