Coriander And Cumin : జీలకర్రను మనం రోజూ వంటల్లో వాడుతూ ఉంటాం. జీలకర్ర వల్ల వంటలకు చక్కటి వాసన, రుచి వస్తుంది. జీలకర్ర రుచిని పెంచడంలోనే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఉదయాన్నే జీలకర్ర నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జీలకర్ర నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో 2 టీ స్పూన్ల జీలకర్రను వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఉదయాన్నే పరగడుపున ఈ జీలకర్ర నీటిని తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది.
మలబద్దకం లాంటి సమస్యలు దూరం అవుతాయి. ఆకలి సరిగ్గా లేని వారు ఈ జీలకర్ర నీటిని తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు దూరం అవుతాయి. ప్రేగుల్లో పురుగులు కూడా ఈ నీటిని తీసుకోవడం వల్ల నశిస్తాయి. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు జీలకర్ర ఎంతో మేలు చేస్తుంది. పాలిచ్చే తల్లులు జీలకర్రను తీసుకోవడం వల్ల వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. జీలకర్ర నీటిని తీసుకోవడంతో పాటు రోజూ వాకింగ్, ధ్యానం, యోగా వంటివి చేయడం, పండ్లుమరియు కూరగాయలను తీసుకోవడం , వీలైనంత ఎక్కువ నీటిని తాగడం వంటి వాటిని రోజూ దినచర్యలో భాగం చేసుకుంటే వయస్సు వెనుకకు పరిగెడుతుంది.
జీలకర్ర నీటి వల్ల మూత్రాశయ సమస్యలు దూరం అవుతాయి. మూత్రపిండాల్లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే రాళ్లు కూడా కరిగిపోతాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. జీలకర్ర నీరు షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ నీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. జీలకర్రలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పలు వ్యాధుల నుండి రక్షిస్తాయి. జీలకర్ర నీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
వాంతులు, వికారం వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. జీలకర్రలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. జీలకర్రను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. జీలకర్రతో పాటు ఇతర పదార్థాలను కూడా కలిపి ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ పానీయానికి కావల్సిన ఇతర పదార్థాల గురించి… దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి మనం జీలకర్రతో పాటు ధనియాలను, సోంపు గింజలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక జార్ లో పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ సోంపు గింజలు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పుల నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ పానీయాన్ని చల్లారిన తరువాత ఒక గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. దీనిని రోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలో కొవ్వు తొలగిపోతుంది.
శరీరం నుండి వ్యర్థాలు బయటకు పోతాయి. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. చర్మం బిగుతుగా ఉంటుంది. కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు తొలగిపోతాయి. ఈ విధంగా జీలకర్ర నీరు అలాగే జీలకర్రను ఉపయోగించి చేసిన పానీయాన్ని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.