Pappu Charu : కారం పొడిని ప్ర‌త్యేకంగా చేసి దాంతో ప‌ప్పు చారు చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Pappu Charu : ప‌ప్పు చారు.. ఈ వంట‌కం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ప‌ప్పుచారు ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం త‌ర‌చూ ప‌ప్పుచారును త‌యారు చేస్తూ ఉంటాం. కొంద‌రికి ప్ర‌తిరోజూ ప‌ప్పుచారు ఉండాల్సిందే. త‌ర‌చూ చేసే ప‌ప్పు చారుకు బ‌దులుగా కింద చెప్పిన విధంగా ప్ర‌త్యేక‌మైన కారం పొడి వేసి చేసే ఈ ప‌ప్పు చారు మ‌రింత రుచిగా ఉంటుంది. ప‌ప్పుచారును మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ప్పుచారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, కందిప‌ప్పు – అర క‌ప్పు, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, చింత‌పండు – 10 గ్రా. లేదా త‌గినంత‌, నీళ్లు – 5 క‌ప్పులు, బెల్లం తురుము – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

కారం పొడి త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని.

Pappu Charu make in this method for better taste
Pappu Charu

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఆవాలు – అర టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీస్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఇంగువ – కొద్దిగా.

ప‌ప్పు చారు త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌ను తీసుకోవాలి. వీటిని మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ పట్టుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కందిప‌ప్పును వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు, చింత‌పండు, ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న కారం పొడి వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత 2 క‌ప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ప‌ప్పు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ ప‌ప్పును గంటెతో లేదా ప‌ప్పు గుత్తితో మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత మిగిలిన నీటిని కూడా పోసి మ‌ర‌లా స్ట‌వ్ మీద ఉంచి మ‌రిగించాలి.

ప‌ప్పు చారు మ‌రుగుతుండ‌గానే మ‌రో స్ట‌వ్ మీద క‌ళాయిని ఉంచి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని ప‌ప్పు చారులో వేసి క‌లుపుకోవాలి. ఈ ప‌ప్పు చారును పొంగు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత బెల్లం ముక్క‌ల‌ను వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ప్పు చారు త‌యార‌వుతుంది. అన్నంతో క‌లిపి తింటే ఈ ప‌ప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే ప‌ప్పు చారు కంటే కూడా ఎండుమిర‌ప‌కాయ‌ల‌ను వేసి చేసే ఈ ప‌ప్పు చారు మ‌రింత రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts