Coriander Leaves On Empty Stomach : మనం వంటలు తయారు చేసిన చివర్లో గార్నిష్ కోసం కొత్తిమీరను వేస్తూ ఉంటాము. వంటల్లో కొత్తిమీరను వేయడం వల్ల మనం చేసే వంటల యొక్క రుచి, వాసన పెరుగుతుందని చెప్పవచ్చు. వంటల రుచిని పెంచడంతో పాటు కొత్తిమీరను వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. కొత్తిమీరలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొత్తిమీరలో ఉండే పోషకాలు, అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తిమీరలో కార్బోహైడ్రేట్స్, విటమిన్ బి6, విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, థయామిన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.
దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా ఉన్నాయి. కొత్తిమీరను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు మన దరి చేరకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కొత్తిమీరను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. అదే విధంగా రక్తపోటును అదుపులో ఉంచడంలో, కంటి సమస్యల రాకుండా చేయడంలో కూడా కొత్తిమీర మనకు దోహదపడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు కొత్తిమీరను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కొత్తిమీరను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా జీర్ణశక్తి మెరుగుపరచడంలో, నోట్లో అల్సర్లను తగ్గించడంలో, అల్జీ మర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా చేయడంలో కూడా కొత్తిమీర మనకు సహాయపడుతుంది. స్త్రీలల్లో వచ్చే నెలసరి సమస్యలను తగ్గించే గుణం కూడా కొత్తిమీరకు ఉంది. మన శరీర ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా కొత్తిమీర చేస్తుంది. అలర్జీ, చికెన్ పాక్స్ వంటి చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కొత్తిమీర మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా కొత్తిమీర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే వంటల్లో కొత్తిమీరను వాడడానికి బదులుగా దీనిని నేరుగా, పచ్చిగా తీసుకోవడం వల్ల మాత్రమే మనం అధిక ప్రయోజనాలను పొందగలమని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం పరగడుపున కొత్తిమీరను జ్యూస్ గా చేసి తీసుకోవడం లేదా నేరుగా నమిలి తినడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల మాత్రమే కొత్తిమీరలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి నేరుగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు.