Garlic Bread : బ్రెడ్ తో మనం రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. బ్రెడ్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో గార్లిక్ బ్రెడ్ కూడా ఒకటి. ఇది ఎక్కువగా డామినోస్ వంటి ఫుడ్ సెంటర్లలో లభిస్తుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ గార్లిక్ బ్రెడ్ ను అదే రుచితో అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ గార్లిక్ బ్రెడ్ ను తయారు చేసుకుని తినవచ్చు. బయట లభించే విధంగా అచ్చం అదే రుచితో అదే స్టైల్ లో ఇంట్లోనే గార్లిక్ బ్రెడ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గార్లిక్ బ్రెడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 4, గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న బటర్ – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 6, రెడ్ చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, ఒరిగానో లేదా పిజ్జా మిక్స్ – ఒక టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, చీజ్ స్లైసెస్ – 2.
గార్లిక్ బ్రెడ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న బటర్ ను తీసుకోవాలి. తరువాత దీనిని స్పూన్ తో మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో వెల్లుల్లి రెబ్బలను తురిమి వేసుకోవాలి. తరువాత చిల్లీ ప్లేక్స్, ఒరిగానో, తెల్ల మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు బ్రెడ్ ను తీసుకుని దానికి ఒక వైపు ఇలా తయారు చేసుకున్న బటర్ ను చాలా తక్కువ మోతాదులో తీసుకుని బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీనిపై చీజ్ స్లెస్ ను ఉంచాలి. ఇప్పుడు మరో బ్రెడ్ స్లైస్ ను తీసుకుని దానికి రెండు వైపులా కొద్ది కొద్దిగా బటర్ మిశ్రమాన్ని రాసి చీజ్ స్లైస్ పై ఉంచాలి.
ఇప్పుడు కళాయిని కొద్దిగా వేడి చేయాలి. తరువాత ఇందులో తయారు చేసుకున్న బ్రెడ్ ను ఉంచి మూత పెట్టి చిన్న మంటపై కాల్చుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కాల్చుకున్న తరువాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. బ్రెడ్ పైన ఎర్రగా అయ్యి లోపల చీజ్ కరిగిన తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గార్లిక్ బ్రెడ్ తయారవుతుంది. దీనిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఇలా చాలా సులభంగా గార్లిక్ బ్రెడ్ ను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు.