Ginger Milk : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వాడుతున్న వంట ఇంటి పదార్థాల్లో అల్లం ఒకటి. దీన్ని రోజూ వంటల్లో వేస్తుంటారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే ఆయుర్వేద ప్రకారం అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందువల్ల అల్లంను రోజూ తీసుకోవాలని మన పెద్దలు కూడా చెబుతుంటారు. అయితే అల్లాన్ని నేరుగా కాకుండా దాని రసాన్ని పాలలో కలిపి తాగితే ఇంకా ఎక్కువ లాభాలను పొందవచ్చు. పాలలో అల్లం రసం కలిపి రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం తాగాలి. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జింజర్ మిల్క్ (అల్లం రసం కలిపిన పాలు) తాగడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఈ సీజన్‌లో మనకు ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. జింజర్ మిల్క్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను నశింపజేస్తాయి. దీంతో క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. సూక్ష్మ క్రిములు శరీరంలోకి చేరగానే నశిస్తాయి. జీర్ణశక్తి లేని వారు లేదా ఆ శక్తి బాగా తగ్గిన వారు నిత్యం జింజర్ మిల్క్‌ను తాగితే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఎలాంటి ఆహారాన్నయినా సరే అవలీలగా జీర్ణం చేసుకోగలుగుతారు. అలాగే మలబద్దకం, కడుపు నొప్పి, అసిడిటీ తగ్గుతాయి.
అల్లం రసం కలిపిన పాలలో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తాయి. ఆస్టియో పోరోసిస్ సమస్య ఉన్నవారు ఈ పాలను తాగితే మంచిది. దీంతో ఎముకల వద్ద శరీర భాగం వాపులకు గురి కాకుండా ఉంటుంది. నొప్పులు తగ్గుతాయి. గొంతు నొప్పి, మంట, గొంతు బొంగురు పోవడం సమస్యలు ఉన్నవారు ఈ పాలను తాగాలి. ఈ పాలలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ పాలను తాగితే వారి షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇలా పాలలో అల్లం రసం కలిపి సేవించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం ఈ పాలను సేవిస్తే మంచిది. దీంతో రోజంతా ఆరోగ్యంగా ఉండవచ్చు.